కళ్ల ముందు గుండె వైఫల్యంతో ఎవరైనా కుప్పకూలిపోతుంటే... అలా చూస్తూ ఉండకుండా సీపీఆర్ చేసి వెంటనే వారిని ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతీపై రెండు చేతులు ఒక దానిపై ఒకటి పెట్టి ఒక పద్ధతి ప్రకారం బలంగా పలు మార్లు తీవ్ర ఒత్తిడి చేయటాన్నే సీపీఆర్ (కార్డియోపల్మనరీ రెస్యూసైటేషన్)గా వ్యవహరిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా గుండె ఆగిన వారిని బతికించే అవకాశం ఎక్కువ. వచ్చే ఆరు నెలల్లో దీనిపై దాదాపు 10 వేల మందికి శిక్షణ అందిస్తాం’ అని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి(Dr. Nageswara Reddy) చెప్పారు.
దేశంలో ఏటా 7 లక్షల మంది సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్నారని నాగేశ్వరరెడ్డి(Dr. Nageswara Reddy) అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి గుండె వ్యాధులపై అవగాహన తప్పనిసరని చెప్పారు. ప్రపంచ హృద్రోగ దినం పురస్కరించుకొని ఏఐజీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో హార్ట్ మార్షల్స్ పేరుతో దశల వారీగా సీపీఆర్ శిక్షణ అందిస్తున్నారు. తొలి విడతలో భాగంగా నగరంలోని వివిధ అపార్ట్‌మెంట్ల వద్ద పనిచేస్తున్న భద్రతా సిబ్బంది వేయి మందికి బుధవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరెడ్డి మాట్లాడారు. వైద్యులు, వైద్య సిబ్బందే కాక.. కనీస అవగాహనతో ఎవరైనా సీపీఆర్ చేయవచ్చన్నారు. ఆసుపత్రికి చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ సి.నరసింహన్ మాట్లాడుతూ సీపీఆర్ చేయడంలో జాప్యం జరిగితే రోగికి ముప్పు పెరుగుతుందన్నారు. ఏఐజీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాజీవ్ మీనన్, డాక్టర్ జి.వి.రావు మాట్లాడారు.