నదులు, సముద్రాల్లో మునిగిపోయే వారిని రక్షించడానికి మానవ రహిత లైఫ్‌గార్డు రూపొందింది. ఈతరాని వారిని, నీటిలో మునిగిపోయే వారిని ఈ లైఫ్‌గార్డు రక్షిస్తుంది. రిమోట్ సాయంతో, బ్యాటరీ ద్వారా నీటిలో రెండు కి.మీ. దూరంలో కొట్టుకుపోయే వారిని కూడా కాపాడుతుంది. దీనికి జీపీఎస్‌ను అనుసంధానించారు.
సముద్ర స్నానాలు చేస్తూ..
రాకాసి అలల్లో చిక్కుకుని ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు కళ్ల ముందే.. కొట్టుకుపోతూ.. హెల్ప్ హెల్ప్ అని అరిచినా.. ఏమీ చేయలేని నిస్సహాయస్థితి. పర్యటక ప్రదేశాల్లో ఇలాంటి సందర్భాలు అనేకం. విశాఖకు చెందిన 'సైఫ్ సీస్' సంస్థ ఈ సమస్యకు పరిష్కారంగా ఓ పరికరాన్ని తయారుచేసింది.
కేవలం పది సెకన్లలోనే..
ఓ చిన్నపాటి క్రాఫ్ట్‌ను తయారు చేసింది 'సైఫ్ సీస్' సంస్థ. దీని పేరు 'హల్ క్రాఫ్ట్'. అలల మీద నుంచి చకచకా దూసుకెళ్లడం దీని ప్రత్యేకత. బీచ్‌లో స్నానం చేస్తూ ఎవరైనా మునిగితే... కేవలం పది సెకన్లలో ఇది కాపాడేందుకు సిద్ధమవుతుంది. సెకనుకు 3 మీటర్ల వేగంతో ఆపదలో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకుంటుంది. ఇది పూర్తిగా రిమోట్ సాయంతో పనిచేసే పరికరం. ప్రయోగాత్మక దశను దాటుకుని... ఇప్పుడు ప్రతి ఒక్క నీటి వనరు దగ్గరా సేవలు అందించేందుకు హల్ క్రాఫ్ట్ సిద్ధమైంది.
లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్-పోలో..
ఈ పరికరంతో బీచ్‌లలో పనిచేసే.. లైఫ్ గార్డులు సైతం ఆపదలో ఉన్నవారి వద్దకు వేగంగా చేరుకునే అవకాశం ఉంది. ఇటీవల లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్-పోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని సైతం ఆకర్షించింది 'హల్ క్రాఫ్ట్'. సముద్రాల్లో మాత్రమే కాకుండా నదులు, రిజర్వాయర్లు వంటి నీటి వనరులు ఉన్న చోట కూడా పని చేస్తుందని 'సైఫ్ సీస్' సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.