ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చేసిన ప్రకటనపై.. ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన ప్రజాసంకల్ప పాదయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రులు పోటీపడి పాదయాత్రలు నిర్వహించారని విమర్శించారు. ఈ పాదయాత్రలకు సుమారు 40 లక్షల మంది హాజరయ్యారని స్పష్టం చేశారు. ఈ పరిస్థితులు చూస్తుంటే నిరభ్యంతరంగా ఎన్నికలు నిర్వహించవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ విషయంలో లేని కరోనా అడ్డంకి.. ఎన్నికల నిర్వహణకే ఎందుకు వచ్చిందన్నారు. ఎన్నికల నిర్వహణ అంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
లేఖ రాయడం బాధ్యతా రాహిత్యం
వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల అధికారి, ఎన్నికలు అంటే భయం పట్టుకుందని ఎంపీ రఘురామ అన్నారు. 151 అసెంబ్లీ స్థానాలు వచ్చినప్పటి నుంచి.. ఏం చేసినా చెల్లుతుందనే భావన వైకాపా నేతల్లో కనబడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించలేమని సీఎస్ రాసిన లేఖ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాజీనామా చేయాలని మంత్రులు ఏ హోదాలో కోరుతున్నారని ప్రశ్నించారు.
"రాష్ట్ర ప్రభుత్వమే నిమ్మగడ్డ రాజీనామా కోరడం రాజ్యాంగ సంస్థల విచ్ఛిన్నానికి చేసే ప్రయత్నానికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముందుకు రాకపోతే.. సుప్రీంకోర్టు కలగజేసుకుని ఆర్టికల్ 356ను అమలు చేయమని ఆదేశించవచ్చు. ఆ రోజు ఎంతో దూరంలో లేదని అనుకుంటున్నా. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు, ప్రజల ఆదరణ ఉందని ధీమా ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణకు అభ్యంతరం ఏంటి? గవర్నర్ ప్రేక్షక పాత్ర వహిస్తే కోర్టులు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఎన్నికలు నిర్వహించడానికి ముందుకు రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఉంది."
- రఘురామకృష్ణరాజు, నర్సాపురం ఎంపీ
ఎస్ఈసీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టులు ఆదేశిస్తే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు పలికారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గౌరవం ఉండాలంటే రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థల విషయంలో సీఎం జగన్ అవలంబిస్తున్న వైఖరికి ప్రతిఫలంగా సీబీఐ కేసులు, విచారణ జరుగుతున్నాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలతో సంబంధం లేని మంత్రి... ఎస్ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గవర్నర్‌తో ఎస్ఈసీ భేటీ