ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.... సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ప్రతివాదులుగా చేరుస్తూ ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఎస్‌ఈసీకి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నవంబర్ 30న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను.. ఉద్దేశపూర్వక ఉల్లంఘించినందున వారిని శిక్షించాలని కోరారు. రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణకు వీలుగా ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
243 కే(3) అధికరణ ప్రకారం
ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికీ అమల్లో ఉందని, ఎన్నికల నిర్వహణ సన్నాహక ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ ప్రభుత్వం సహకరించకోపోవడం... అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనన్నారు. రాజ్యాంగంలోని 243 కే(3) అధికరణ ప్రకారం విధుల నిర్వహణలో ఎస్‌ఈసీ ఎప్పుడు కోరితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరి ఆ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు.
2006లో సుప్రీం ఇచ్చిన తీర్పు..
ఎస్‌ఈసీ స్వతంత్ర సంస్థ అని తన వ్యాజ్యంలో పేర్కొన్న నిమ్మగడ్డ.... దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ ఉండదన్నారు. అధికార పార్టీ ప్రభావం లేకుండా నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వ సహకారం అందట్లేదని భావించినప్పుడు... తొలుత హైకోర్టును, తర్వాత సుప్రీంను ఆశ్రయించొచ్చని.... 2006లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఎస్‌ఈసీని తన నియంత్రణలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని.. ఇది సంస్థ స్వతంత్రతను దిగజార్చడమేనన్నారు.
ప్రొసీడింగ్స్ జారీ చేసి..
గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణకు సహకరించాలని ఎన్నికల సన్నద్ధతపై సమీక్షకు కలెక్టర్లు, ఎస్పీలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరామని.... నిమ్మగడ్డ వ్యాజ్యంలో పేర్కొన్నారు. తమకు సహకరించడంలో సీఎస్ విఫలమయ్యారన్నారు. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు.... నవంబర్ 17న ప్రొసీడింగ్స్ జారీ చేసి... 18,19 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించదలిచినట్టు ప్రభుత్వానికి తెలిపామన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఆటంకం
కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని... ఎన్నికల నిర్వహణపై పునరాలోచించాలని ద్వివేది కోరారని... నిమ్మగడ్డ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జిల్లాల అధికారులతో ఎన్నికలపై సమీక్షకు ఏర్పాట్లు చేయకుండా నీలం సాహ్ని, ద్వివేది బాహాటంగానే నిరాకరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ సొంతంగా వ్యవహరిస్తూ... వీడియో కాన్ఫరెన్స్‌కు సహాయనిరాకరణ చేశారని... ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించారన్నారు.
గవర్నర్‌ను కోరాం..
కరోనా కేసులు తగ్గాక ప్రభుత్వం ఎన్నికల నిర్వహణను పరిగణనలోకి తీసుకుంటుందని... సీఎస్ పేర్కొన్నారని.... ఇది ఎన్నికల సంఘాన్ని అవమానించడమేనని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ప్రాథమిక సంప్రదింపుల ప్రక్రియను సీఎస్ నిలిపివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... నవంబర్ 19న లేఖ పంపామని ప్రస్తావించారు. సహకారమందించే విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.... గవర్నర్ జోక్యాన్ని కోరినట్టు తెలిపారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని
ఎన్నికల కమిషనర్‌పై మంత్రి కొడాలి నాని చేసిన అసభ్యకర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. న్యాయవాదుల రుసుము కోసం... కోటి రూపాయల అదనపు నిధుల మంజూరుకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరమని ఉద్దేశపూర్వక షరతు విధించారని పేర్కొన్నారు. ఎస్‌ఈసీకి నిధులు విడుదల చేయడంలో సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని.... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ద్వివేది, నీలం సాహ్నిపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ కోరారు.
ఇదీ చదవండీ... 'రోజుకు 18,350 పరీక్షలే లక్ష్యంగా పనిచేస్తున్నాం'