ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై ఉన్న గాయాల్ని గుంటూరు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)తో పాటు రమేశ్ ఆసుపత్రిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి(ఏజేసీజే)/ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినా.. ఆ మేరకు ఎందుకు వ్యవహరించలేదని సీఐడీని హైకోర్టు నిలదీసింది. రమేశ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఎంపీని సీఐడీ అధికారులు జైలుకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను వైద్యపరీక్షల నిమిత్తం తక్షణం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ పోలీసులను ఆదేశించింది.
దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లేవనెత్తిన అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వుల అమలును కొద్దిరోజులు నిలుపుదల చేయాలన్న అభ్యర్థననూ నిరాకరించింది. ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తే తప్పేంటని ప్రశ్నించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఆదివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ తరఫు న్యాయవాదికి సూచించింది. విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టు ఉత్తర్వులపై వక్రభాష్యం
ఎంపీ తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ‘తనను పోలీసులు కొట్టారని రఘురామ కృష్ణరాజు గుంటూరు ఆరో జేసీజే న్యాయమూర్తి వద్ద హాజరుపరిచినప్పుడు తెలిపారు. దీంతో న్యాయమూర్తి గుంటూరు జీజీహెచ్‌తో పాటు రమేశ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేసి గాయాలపై నివేదిక ఇవ్వాలని శనివారం ఆదేశించారు. హైకోర్టు సైతం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించమంది. చట్టప్రకారం మెజిస్ట్రేట్ జారీచేసిన ఆదేశాల్ని పట్టించుకోకుండా జీజీహెచ్‌లో పరీక్షల అనంతరం ఎంపీని నేరుగా జైలుకు తరలించారు. రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించలేదు. జైలుకు తీసుకెళితే ఎంపీని హతమారుస్తారని శనివారమే కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. పోలీసు దెబ్బలకు ఆయన నడిచే పరిస్థితుల్లో లేరు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పోలీసులు అంటున్నారు. మెజిస్ట్రేట్ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయనే వక్రభాష్యం చెబుతున్నారు. వైద్యపరీక్షల అనంతరం ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా జైలుకు తీసుకెళ్లారని టీవీల ద్వారా తెలిసింది’ అన్నారు. ఈ వ్యవహారంపై ధర్మాసనం ఏఏజీని వివరణ కోరింది.
ఉత్తర్వులు సవరించే ప్రక్రియలో ఉంది: ఏఏజీ
ఏఏజీ బదులిస్తూ.. ‘హైకోర్టు ఉత్తర్వులను మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లాం. వాటిని తమ ముందు ఉంచితే ఆ మేరకు ఉత్తర్వులను సవరిస్తామని మెజిస్ట్రేట్ అన్నారు. ఆదివారం ఉదయం హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని ఆన్‌లైన్ ద్వారా మెజిస్ట్రేట్‌కు పంపాం. ఉత్తర్వులను సవరించే ప్రక్రియ జరుగుతోంది’ అన్నారు.
సవరిస్తారనే ఊహతో జైలుకు తరలించేస్తారా?
ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర్వులను మెజిస్ట్రేట్ సవరిస్తారనే ఊహాగానంతో ఎంపీని జైలుకెలా తరలిస్తారని ప్రశ్నించింది. ఉత్తర్వులను సవరించక ముందే తరలించడం ఏమిటని నిలదీసింది. మెజిస్ట్రేట్, హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో నుంచి మీకు నచ్చిన కొంత భాగాన్ని ఎలా ఎంపిక చేసుకుంటారని నిలదీసింది. ఆ ఉత్తర్వులపై సందేహాలుంటే న్యాయస్థానం నుంచి స్పష్టత కోరాలని తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ బోర్డు నివేదిక సమర్పించాలని ఆదేశించాం.. నివేదిక ఆలస్యమవుతోందనే సమాచారాన్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేని నిలదీసింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిన బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నించింది.
ఎంపీ న్యాయవాది స్పందిస్తూ.. మెడికల్ బోర్డు వైద్యులతో మాట్లాడటానికే వీల్లేకపోతే ఎంపీ ఉన్న ఆసుపత్రిలోని గదికి సీఐడీ అదనపు డీజీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎలా వెళ్లారన్నారు. అందుకు సంబంధించిన మీడియా క్లిప్పింగ్‌లు ఉన్నాయన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారైన అదనపు డీజీ.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి ఎంత ధైర్యం అని న్యాయవాది వ్యాఖ్యానించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ వైకాపా లీగల్ సెల్‌లో పనిచేసే వ్యక్తి భార్య అని ఆయన చెప్పారు. తమకు నోటీసులివ్వకుండా మెజిస్ట్రేట్ ఉత్తర్వులు సవరించడానికి వీల్లేదన్నారు. జైల్లో ఎంపీని హతమార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ ఆరోపణపై ఏఏజీ అభ్యంతరం తెలిపారు. స్టేట్ నిజంగా ఇంట్రస్ట్‌గా ఉంటే.. జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. మమ్మల్ని డిక్టేట్ చేయవద్దని, కోర్టు ముందున్నామని అదనపు ఏజీ.. సీనియర్ న్యాయవాదిని ఉద్దేశించి పెద్ద స్వరంతో అన్నారు. తన కక్షిదారు తరఫున వాదనలు చెప్పేందుకు తనకు అధికారం ఉందని, మీ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదని సీనియర్ న్యాయవాది బదులిచ్చారు. స్వీయనియంత్రణ పాటించాలని ధర్మాసనం ఇద్దరికీ సూచించింది.
రమేశ్ ఆసుపత్రికి తరలించడం అంటే తెదేపా కార్యాలయానికి పంపడమే: ఏఏజీ
మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీని తక్షణం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఏఏజీ అభ్యంతరం తెలుపుతూ రమేశ్ ఆసుపత్రికి తరలించడం అంటే తెదేపా కార్యాలయానికి పంపడం లాంటిదేనన్నారు. అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన వ్యవహారంలో రమేశ్ ఆసుపత్రి ఎండీపై ఇప్పటికే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తుచేశారు. అక్కడికి పంపొద్దని కోరగా ధర్మాసనం నిరాకరించింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వులను కనీసం రెండు రోజులైనా నిలుపుదల చేయాలన్న ఏఏజీ అభ్యర్థననూ తోసిపుచ్చింది.
నా భర్తకు ఏమైనా జరిగితే సీఎందే బాధ్యత : ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ
తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆసుపత్రికి ఆయన్ను తరలించాలని కోర్టు ఆదేశించినా, జైలుకు తీసుకెళ్లారని అక్కడ ఆయన భద్రత పట్ల తనకు భయం ఉందని చెప్పారు. ఈ ప్రభుత్వంపై తనకు విశ్వాసం లేదని, ఆదివారం రాత్రి ఆయనపై జైలులో దాడి జరగొచ్చనే సమాచారం ఉందన్నారు. రఘురామకృష్ణరాజుకు ఏమైనా జరిగితే సీఎం, సీఐడీయే బాధ్యత వహించాలని వివరించారు.
‘ఆయనకు గాయాలు కాలేదు’
రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితిపై మెడికల్ బోర్డు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. శరీరంపై ఆయనకు గాయాలు కాలేదని నిర్ధారించింది. ‘రెండు పాదాలు వాచి ఉన్నాయి. అరికాళ్లలో రంగుమారి ఉంది. పైన గాయాలైనట్లు ఆధారాలు లేవు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. నొప్పి అంటున్నందున కార్డియాలజిస్ట్‌కు చూపించాం. ఆ వైద్యులు ఆస్వస్థత ఏదీ లేదన్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు వివరిస్తున్నారు’ అని నివేదికలో పేర్కొంది.
ఇదీ చదవండి: రఘురామను జైలు నుంచి వెంటనే ఆస్పత్రికి పంపండి: ఏపీ హైకోర్టు