పోలీసులు ఏపీలో పలువురిని నిర్బంధంలోకి తీసుకున్న ఘటనలపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో నిర్ణయిస్తామని ఈ ఏడాది అక్టోబరు 1న ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సోమవారం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. దాంతో బుధవారం ఈ అంశంపై విచారణ కొనసాగించింది. తమ అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ తెలిపారు. తమ అప్పీలుపై అత్యవసరంగా విచారణ జరపాలని ఈనెల 18న సుప్రీంకోర్టును కోరనున్నామన్నారు. అందువల్ల విచారణను 21వ తేదీకి వాయిదా వేయాలనగా, అందుకు ధర్మాసనం నిరాకరించింది.
మేముండి ఉపయోగం ఏంటి?
యిదా వేసే ప్రసక్తే లేదని, సుప్రీంకోర్టులో స్టే వస్తేనే ఇక్కడి విచారణను నిలుపుదల చేస్తామని న్యాయస్థానం చెప్పింది. రాజ్యాంగ విచ్ఛిన్నంపై వాదనలు మొదలయ్యాయని, వాటిని కొనసాగించాలని ఎస్‌ఎస్ ప్రసాద్‌ను కోరింది. ఈ వ్యాజ్యాలపై ‘సాధారణ పద్ధతి’లో విచారణ జరపాలని ఆయన అడగడంతో జస్టిస్ రాకేశ్‌కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఓ వ్యక్తిని ఏడు రోజులు అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులు.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసిన తర్వాతే అతడిని విడుదల చేశారన్నారు. దీన్ని సాధారణ పద్ధతిగా పేర్కొంటారా..? అంటూ నిలదీశారు. వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పించలేనప్పుడు.. హైకోర్టు జడ్జీలుగా తాముండి ఉపయోగం ఏమిటని ఘాటుగా వ్యాఖ్యానించారు.
చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చెప్పాలని సీనియర్ న్యాయవాది ప్రసాద్ ధర్మాసనాన్ని కోరారు. చిత్రహింసలు లేవని మీరు అఫిడవిట్ దాఖలు చేస్తారా..? అని ఈ సందర్భంలో ధర్మాసనం ప్రశ్నించగా.. తామెందుకు దాఖలు చేస్తామని సీనియర్ న్యాయవాది ప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఏ కేసులో ఏం జరిగిందో తాము పట్టిక రూపంలో వివరాలు సమర్పించామని, దాన్ని పరిశీలించాలని కోరారు. అసలు విషయంపై వాదనలు చెప్పకుండా సమయాన్ని వృథా చేస్తున్నారని ప్రసాద్‌పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
కోర్టు విడిచి వెళ్లేలా బలవంతం చేయవద్దు: జస్టిస్ రాకేశ్‌కుమార్
రాజ్యాంగ విచ్ఛిన్నంపై కోర్టు పరిగణనలోకి తీసుకున్న అంశాల మీద కౌంటరు వేయడానికి సమయం కావాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుమన్ కోరారు. గడువు ఇవ్వలేమన్న ధర్మాసనం.. ఇలా వ్యవహరించి వాయిదా వేయించాలనుకుంటే విచారణను ముగించేసి తీర్పును వాయిదా వేసేస్తామని హెచ్చరించింది. కౌంటరు వేయడానికి గడువు కోరిన విషయాన్ని ఉత్తర్వుల్లో నమోదు చేయాలని జీపీ సుమన్ పట్టుబట్టారు. న్యాయబద్ధంగా వాదనలు చెప్పేందుకు తమకు సమయం ఇవ్వలేదని, అసలు సోమవారం నాటి ఉత్తర్వుల కాపీలు తమకు అందలేదని చెప్పారు.
ఉత్తర్వుల కాపీలను ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్, మరో జీపీ వివేకానంద ఏదో చెప్పబోగా ఈ సందర్భంలో ఆ విషయాలు చెప్పొద్దని ధర్మాసనం పేర్కొంది. ఇలా తనపై ఒత్తిడి తెస్తూ.. కోర్టు విడిచి వెళ్లేలా బలవంతం చేయొద్దని జస్టిస్ రాకేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. వాదనలు పూర్తికాలేదని, తాము చెప్పేది వినాలని ఎస్‌ఎస్ ప్రసాద్ మరోసారి కోరారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. కేసు విచారణను వాయిదా వేసి, వేరే కేసులో వాదనలు వింటున్న సమయంలో సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకోవడం ప్రారంభించారని ఉత్తర్వుల్లో నమోదు చేసి.. ఆయన జోక్యాన్ని నిలువరించింది.
కోర్టును బెదిరిస్తారా..?
ఈ కేసు విచారణ సమయంలో ఈనెల 14న ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టును బెదిరించారని జస్టిస్ రాకేశ్‌కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించడంతో దీనిపై కోర్టుకు.. ప్రభుత్వ న్యాయవాదులకు మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ధర్మాసనం వ్యాఖ్యపై జీపీ సుమన్ అభ్యంతరం తెలపగా, ‘ఔను.. నన్ను బెదిరించారు’ అని జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పష్టంచేశారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బెదిరించారని చెబుతున్నారా అంటూ జీపీ స్పష్టత కోరగా.. ఆయన కాదని న్యాయమూర్తి తెలిపారు. మరి ఎవరు బెదిరించారని అడగ్గా.. పోలీసుల తరఫున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ ఆరోజు విచారణలో ఉన్నారని న్యాయమూర్తి వెల్లడించారు.
మరో జీపీ వివేకానంద జోక్యం చేసుకుంటూ సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.ప్రసాద్ బెదిరించలేదన్నారు. ‘‘అనుబంధ పిటిషన్లను విచారించాలని కోరితే బెదిరించారనడం సరికాదు. సీనియర్ జడ్జిగా మీరు అలా అంటే ఈ కేసుల్లో విచారణలో ముందుకెళ్లలేం. రాజ్యాంగ రక్షకులైన మిమ్మల్ని బెదిరిస్తే ఇంకేముంది..? మీకు రక్షణగా ముందువరసలో ఉండే వ్యక్తులము మేమే. ఈ రాష్ట్రంలో మీరు బెదిరింపునకు గురైనట్లు భావించొద్దు. వ్యవస్థల రక్షణకు మేం ముందు నిలుస్తాం’’ అన్నారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పందిస్తూ.. ఆ రోజు విచారణలో నోరు జారారో.. తమపై మాటలతో దాడి చేశారో గానీ, సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ తీరు బెదిరించినట్లే ఉందన్నారు.
తొలుత ఈ కేసులో విచారణ మొదలైనప్పుడు పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. తెలంగాణ హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే విచారణకు హాజరై కొద్దిసేపట్లో తిరిగి ఏపీ హైకోర్టు విచారణకు లాగిన్ అవుతానన్నారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. అప్పటికే లాగిన్ అయి ఉన్న ఇతర ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ విచ్ఛిన్నంపై తేల్చే విచారణాధికార పరిధి కోర్టుకు లేదని ఏజీ ఈనెల 14న జరిగిన విచారణలో చెప్పారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగానే గత విచారణలో కోర్టును బెదిరించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నేను లేనప్పుడు వ్యాఖ్యానించడం సరికాదు...
తెలంగాణ హైకోర్టులో పని ముగించుకొని ఏపీ హైకోర్టులో లాగిన్ అయిన సీనియర్ న్యాయవాది ఎస్‌ఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. కోర్టును తాను బెదిరించినట్లు వ్యాఖ్యానించారంట కదా..? అని ఆరాతీశారు. అందుకు ధర్మాసనం.. బహుశా నోరుజారడం ద్వారానో లేదా మాటలతో దాడి చేయడం ద్వారానో అలా చేసి ఉంటారని పేర్కొన్నట్లు తెలిపింది. విచారణ ప్రక్రియలో తాను లేనప్పుడు తనపై వ్యాఖ్యానించడం సరికాదని ప్రసాద్ అన్నారు. కేసుకు సంబంధం లేని అంశాలు చెబుతున్నారంటూ ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. తనపై వ్యాఖ్యలు చేశారని ప్రసాద్ మరోసారి ప్రస్తావించగా.. తాము ఎవరిపైనా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టత ఇచ్చింది. ‘మీ తీరుపై కోర్టు నుంచి సర్టిఫికేషన్ కోరుతున్నారా..?’ అని ప్రశ్నించింది. తాము అడిగినదాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని న్యాయవాది అనగా.. అసలు విషయం నుంచి పక్కకు వెళ్లొద్దని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వ్యాజ్యాల్లో కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) వాదనలు వినిపించాలని సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డిని ధర్మాసనం కోరగా.. తాను సిద్ధమని ఆయన బదులిచ్చారు. దీనిపై నిర్ణయం జరగకుండానే విచారణ గురువారానికి వాయిదా పడింది.
ఇవీ చూడండి: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు, పదోన్నతులకు రంగం సిద్ధం