AP HC on MLC Ananth Babu Crime Records : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు నేర చరిత్రను తమ ముందు ఉంచాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఎమ్మెల్సీపై దిగువ న్యాయస్థానంలో వేసిన అభియోగపత్రం, మృతుడు సుబ్రమణ్యం పోస్టుమార్టం నివేదిక వివరాలను సమర్పించాలని తెలిపింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడైన అనంతబాబు సాధారణ బెయిలు మంజూరు చేయాలని ఒక పిటిషన్, రిమాండ్ కు పంపిన 90 రోజుల్లోపు దర్యాప్తు పూర్తిచేసి కింది కోర్టులో పరిపూర్ణమైన అభియోగపత్రం ఫైల్ చేయని కారణంగా సీఆర్‌పీసీ సెక్షన్ 167 ( 2 ) ప్రకారం డిఫాల్డ్ బెయిలు ఇవ్వాలని మరో వ్యాజ్యం దాఖలు చేశారు.
AP HC on MLC Ananth Babu Criminal Records : ఈ వ్యాజ్యపై మృతుడి తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. దిగువ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాన్ని లోపాలున్నాయనే కారణంతో న్యాయస్థానం తిరస్కరించిందని ఎమ్మెల్సీ తరఫున సీనియర్ న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించారు. తనే హత్యకు పాల్పడ్డానని పిటిషనర్ వాంగ్మూలం ఇచ్చారని పోలీసులు చెప్పడం తప్ప మరో సాక్ష్యం లేదన్నారు. షరతులతో బెయిలు మంజూరు చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ అనంతబాబుకు నేరచరిత్ర ఉందని ఆయనపై పోలీసులు రౌడీషీట్ తెరిచారని, మృతుడి తల్లి తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ విధించిన 15 రోజులలోపు పోలీసులు పిటిషన్ వేయాల్సి ఉందన్నారు. ఆ నిబంధనను విస్మరించడంతో పోలీసులు వేసిన కస్టడీ పిటీషన్ ను దిగువ కోర్టు కొట్టేసిందన్నారు. ఆ ఉత్తర్వుల విషయంలో హైకోర్టులో వేసిన అప్పిల్ విచారణ పెండింగ్లో ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 14 కి వాయిదా వేసింది.