ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైద్యం సకాలంలో అందని ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని కొవిడ్ రోగులకు చికిత్స అందించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యంతోపాటు.. మరికొన్ని వ్యాజ్యాలు, లేఖలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.
ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటే.. బాధితులకు సమీపంలోనే సత్వర వైద్యం అందే అవకాశం ఉందని తెలిపింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగే ఇబ్బందిని అధిగమించేందుకు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో వివరాలను సమాచార కేంద్రం ద్వారా తెలియజేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నరోగుల హెల్త్‌బులిటెన్‌లు సైతం విడుదల చేయాలని ఆదేశించింది. టోల్‌ఫ్రీ నంబర్ 104తోపాటు మరో నంబర్ ఏర్పాటు చేయాలంది.
కేసులు తగ్గుముఖం పట్టలేదు కదా..
వ్యాక్సినేషన్ ప్రక్రియపైనా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీకాలు వేసే సమయంలో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కరోనా కట్టడి, చికిత్సల విషయంలో లోపాలను ఎత్తిచూపిన ధర్మాసనం.. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ ఎంతవరకు ఫలితాలనిచ్చిందని ప్రశ్నించిన హైకోర్టు.. కేసులు తగ్గుముఖం పట్టలేదు కదా అని వ్యాఖ్యనించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వివరణ ఇచ్చారు. కర్ఫ్యూ వల్ల వైరస్ విస్తరణ గొలుసును నిలుపుదల చేయగలిగినట్లు తెలిపారు. కొవిడ్ ఆస్పత్రులను సైతం 650 నుంచి 680కి పెంచామన్నారు.
వారి సేవలను వినియోగించుకోండి..
ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యలోపంపైనా ధర్మాసనం ప్రశ్నించింది. పట్టణాలు, నగరాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై.. ఆలోచించాలని సూచించింది. అంబులెన్సులు అధిక రుసుం వసూలు చేయకుండా.. అవసరమైతే వాటినీ ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సిబ్బంది కొరతను అధిగమించేందుకు నర్సింగ్ చివరి ఏడాది చదువుతున్న వారి సేవలు వినియోగించుకోవాలని తెలిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని వాటిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే కేంద్రం మాత్రం ఏపీకి 100 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 97 మెట్రిక్ టన్నులు.. కేటాయించామనడంలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం.. ఆక్సిజన్ సరఫరా చేస్తోందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
ఇదీ చదవండి: 'టొసిలిజుమాబ్ బ్లాక్ ఫంగస్ కోసం కాదు.. ప్రత్యామ్నాయమిదే'