ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ కుట్ర పన్నారని కౌంటర్‌లో ప్రభుత్వం పేర్కొంది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రఘురామ ప్రయత్నించారని పేర్కొంది. ఇలాంటి సమయంలో ఫిర్యాదు దాఖలయ్యే వరకు ప్రభుత్వం చేతులు ముడుచు కూర్చోదని ప్రభుత్వం తెలిపింది.
వాక్ స్వాతంత్య్ర హక్కు పేరుతో హద్దులు మీరకూడదని, ప్రజల మధ్య చీలికతెచ్చే ప్రయత్నాలు సరికాదని ప్రభుత్వం పేర్కొంది. ఎంపీ ప్రకటనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపింది.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం రఘురామను గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రఘురామ సైనిక ఆసుపత్రిలోనే ఉన్నారు. మంగళవారం ఆయనకు ముగ్గురు వైద్యులతో కూడిన బృందం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ డి.నాగార్జున నియమితులయ్యారు. వైద్యాధికారుల నివేదికను జ్యుడీషియల్ రిజిస్ట్రార్ హైకోర్టుకు అందజేశారు. డాక్టర్ల నివేదికతోపాటు.. వీడియో ఫుటేజిని సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు పంపింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రఘురామ సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోనున్నారు.
ఇవీచూడండి: అమిత్‌షాను కలిసిన ఎంపీ రఘురామ కుటుంబ సభ్యులు