ఈ నెల డిసెంబర్ 17 నాటికి ఏపీ రాజధాని అమరావతి ఉద్యమానికి 365 రోజులు పూర్తి కానున్న తరుణంలో భవిష్యత్ కార్యాచరణపై అమరావతి పరిరక్షణ సమితి అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. జగన్‌కు అమరావతి ఉద్యమం వేడి తాకిందని... మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేయిస్తున్నారని ఐకాస నేతలు ఆరోపించారు.
తెదేపా అమరావతి రాజధానికి మద్దతుగా ఉంటారని స్పష్టం చేసింది. అమరావతి వికేంద్రీకరణ చేయడం ముఖ్యమంత్రికి సాధ్యం కాదని తేల్చిచెప్పింది. భూములు ఇచ్చేవారు పోరాటం చేయడం ఎక్కడా చూడలేదని అభిప్రాయపడింది. అమరావతిలో లక్షకోట్ల ఆస్తి ప్రభుత్వం వద్ద ఉంచుకొని... లక్షకోట్ల రూపాయలు వెచ్చించాలని చెబుతున్నారని మండిపడింది.
సంవత్సరమైనా అమరావతి విషయంలో భాజపా నాయకులు రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని ఐకాస నేతలు మండిపడ్డారు. తెలంగాణకు బానిసలుగా బతకాలని పాలకులు భావిస్తున్నారని విమర్శించారు. అమరావతినే కాపాడుకోలేకపోతే భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
అమరావతి ఉద్యమానికి మంచి రోజులు వస్తాయని ఐకాస నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. దిల్లీ ఉద్యమం జయప్రదమైతే తమ ఉద్యమం జయప్రదం అవుతుందన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేయవద్దని నేతలు హితవు పలికారు. దీన్ని ప్రజాఉద్యమంగా మార్చకపోతే ఏమి సాధించలేమన్నారు. ప్రతి జిల్లాకు బస్సుయాత్ర చేపట్టి 'ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని' ఏర్పాటు ఆవశ్యకతను చాటి చెప్పాలని నేతలు స్పష్టం చేశారు.