రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ ఆధ్వర్యంలో మరోసారి యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా పోరాటయోధులైన పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, మీడియా సిబ్బందికి ఈ పరీక్షలు చేయనున్నారు. సచివాలయంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ముఖ్య కార్యదర్శి శాంతికుమారితో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు శనివారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో సామాజిక వ్యాప్తి లేదని వెల్లడైంది. తాజాగా మూడోసారి జీహెచ్‌ఎంసీలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2వేల మందికి
దేశంలో తొలి దశ కింద మెట్రో నగరాలైన ముంబయి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2 వేల మందిని ఎంపిక చేసి యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఒక్కో విభాగం నుంచి కొందరిని ఎంపిక చేసి గ్రూపులుగా విభజిస్తారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న పోరాట యోధులకు పరీక్షలు చేస్తారు. శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీస్ ద్వారా ఎంత మందికి కరోనా వచ్చి పోయిందో ఈ పరీక్షల ద్వారా తెలియనుంది. యాంటీబాడీస్ కనిపించిన, కనిపించని వారిలో రోగ నిరోధకశక్తిని పరిశీలిస్తారు.
సోమవారం నుంచి ప్రక్రియ
వీరికి మూడు నెలల పాటు సప్లిమెంటరీ విటమిన్‌లైన ఈ, బీ, బీ12, జింక్ తదితర పోషక విలువలు అందిస్తారు. ఈ కాలంలో రోగ నిరోధకశక్తి ఏ స్థాయిలో పెరుగుతోంది? తద్వారా వైరస్ ఏ మేరకు ఎదుర్కొంటున్నారో తెలుస్తుందని ఎన్‌ఐఎన్ సీనియర్ శాస్త్రవేత్త లక్ష్మయ్య తెలిపారు. కరోనా తీవ్రత, సామాజిక వ్యాప్తి అంచనా వేయడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని వివరించారు. ఈ పరీక్షలకు రూ. 70 లక్షల వరకు ఖర్చు కానుంది. పరీక్షల కిట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. పోరాటయోధుల ఎంపిక ప్రక్రియ సోమవారం ప్రారంభించి రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. వచ్చే వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ