కరోనా ప్రభావంతో ఏకాంతంగా నిర్వహిస్తున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అర్చకులు ఆలయంలోనే శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో రెండవ రోజైన ఆదివారం ఉదయం ఐదు తలల చిన్న శేష వాహనంపై స్వామివారు నెమలి పింఛం, పిల్లనగ్రోవితో మురళీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి నిర్వహించిన హంస వాహనంపై వీణ ధరించి సరస్వతిమూర్తిగా అభయప్రదానం చేశారు. ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేయడం వల్ల ఆలయంలోని కల్యాణ మండపంలో వాహనసేవలను నిర్వహిస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపనతిరుమజన కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ గోవిందాచార్యులు స్నపనతిరుమంజనాన్ని నిర్వహించారు. 2 గంటల పాటు జరిగిన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించారు. స్వామి, అమ్మవార్లకు దూపదీప నైవేద్యాలను సమర్పించారు.
ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సింహవాహనసేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవను నిర్వహిస్తారు.
ఇదీ చదవండీ... హంస వాహనంపై...శ్రీవారి వైభవం