రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీల సమాచారం ఇవ్వాలని సీఎం సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వాస్తవానికి ఉద్యోగుల పీఆర్‌సీ, పదవీ విరమణ వయోపరిమితి పెంపుతో పాటు ఖాళీల భర్తీపైనా ప్రకటన చేయాలని సీఎం భావించారని సమాచారం. ప్రభుత్వ శాఖల్లో రూపొందించిన జాబితాలో డిసెంబరు నెలాఖరు వరకే సమాచారం ఉన్నట్లు అధికారులు తెలియజేయడంతో...ఫిబ్రవరి నెలాఖరు వరకు కావాలని సీఎం సూచించారు. ఈ మేరకు సీఎస్ సోమవారం అన్ని శాఖల కార్యదర్శుల నుంచి సమాచారం కోరారు.
మంగళవారం వరకు అది సిద్ధమైతే దానిని సాయంత్రం వరకు సీఎంకు సమర్పించనున్నారు. గురువారం లేదా శుక్రవారం శాసనసభలో సీఎం దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ముందుగా పోలీసు తదితర నియామక సంస్థల ద్వారా ఖాళీల భర్తీని ప్రకటించే వీలుంది. నెలవారీగా ఉద్యోగ నియామకాల క్యాలెండర్ రూపకల్పనపైనా సీఎం దృష్టి సారించినట్లు తెలిసింది.
ప్రపంచం కొనియాడుతుండటం మనకు గర్వకారణం: కేసీఆర్
నీరు, సహజ వనరులను కాపాడటం ద్వారా ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడమే రేపటి తరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సోమవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అడుగంటిపోయిన భూగర్భ జలాలను తిరిగి పెంపొందించే దిశగా సాగు, తాగునీటి పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో భూ ఉపరితల జలాల లభ్యత పెంచామని తెలిపారు. తద్వారా భూగర్భ జలాల పునరుజ్జీవనం జరుగుతోందన్నారు.
మిషన్ భగీరథ కార్యక్రమం రాష్ట్ర ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిందని వెల్లడించారు. ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలతో జలవనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహా ప్రపంచ జలవనరుల నిపుణులు రాష్ట్రంలో జరుగుతున్న జల పునరుజ్జీవన కార్యక్రమాలను కొనియాడుతుండటం మనకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.