Women's International Master title winner: ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ అనే చిన్నారి విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. మౌనిక అమ్మానాన్నలు ప్రైవేటు ఉపాధ్యాయులు. కాలక్షేపం కోసం అప్పుడప్పుడు చదరంగం ఆడేవాళ్లు. అప్పుడు మౌనిక ఆసక్తిగా గమనించేది. దాంతో తనకీ మెల్లగా ఆటను పరిచయం చేశారు. తమకు తెలిసిన వ్యూహాలు, ఎత్తుగడలు నేర్పించారు. అన్నింటినీ ఒడిసిపట్టి తనకన్నా పెద్దవయసు వాళ్లని అవలీలగా ఓడించేది. ఆ ప్రతిభకు అంతా ఆశ్చర్యపోయేవాళ్లు. మంచి శిక్షణ ఇప్పిస్తే కూతురు మేటి క్రీడాకారిణి అవుతుందని భావించిన ఆ తల్లిదండ్రులు గుంటూరులోనే ఒక ప్రముఖ కోచ్ దగ్గర చేర్పించారు. ఆయన శిష్యరికంలో రాటుదేలింది. బడికెళ్తూనే ఖాళీ సమయంలో మనసంతా అరవై నాలుగు గళ్లపై పెట్టేది. మెల్లగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ సత్తా చూపింది. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన అండర్-7 రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారి కాంస్యపతకం సాధించింది. ఆపై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దూసుకెళ్తోంది.
ఇంటి నిర్మాణం ఆపేసి..
చదరంగం ఆటలో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. ఆర్థిక సహకారమూ తప్పనిసరి. రాష్ట్రాలు, దేశాలు తిరుగుతూ పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అరకొర జీతంతో కుటుంబం నెట్టుకొస్తున్న మౌనిక తల్లిదండ్రులకు ఇది తాహతుకు మించిన వ్యవహారమే. దీన్ని గమనించి ఇరుగూపొరుగూ, బంధువులు ‘ఆడపిల్లకు అంత వ్యయప్రయాసలు, ఖర్చుతో కూడుకున్న ఆట అవసరమా?’ అంటూ నిష్ఠూరమాడేవాళ్లు. కూతురి భవిష్యత్తే ముఖ్యం అనుకున్న కన్నవాళ్లు ఆ మాటలు పట్టించుకోలేదు. చివరికి సొంతింటి నిర్మాణం కోసం దాచుకున్న నగదుతో కుమార్తెను విదేశాల్లో జరిగే పోటీలకు పంపుతున్నారు. కన్నవాళ్ల త్యాగాన్ని ప్రతిక్షణం గుర్తు చేసుకునే మౌనిక.. పంచప్రాణాలు ఆటపైనే పెట్టి మిన్నగా రాణిస్తోంది. ఇప్పటికే మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకున్న తను.. త్వరలోనే చిరకాల స్వప్నం మహిళా గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదిస్తానంటోంది. దీనికోసం గ్రాండ్ మాస్టర్‌లు స్వయంత్ మిశ్రా, శ్యామ్‌సుందర్‌ల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటూ నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటోంది.
అమ్మతో కలిసి..
కేఎల్‌ఎన్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక చదువుల్లోనూ రాణిస్తోంది. ఇంటర్ వరకూ కోచింగ్‌కు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని భాష్యం సంస్థ అందించింది. ‘నాకు చదువూ... చెస్ రెండూ ముఖ్యమే. వారాంతాల్లో ఎక్కువ సమయం సాధన చేస్తుంటాను. మొదట్లో అమ్మ లక్ష్మితో కలిసి విదేశాలకు వెళ్లేదాన్ని. ఇలా అయితే ఖర్చు ఎక్కువ అవుతోంది. అంత స్తోమత మాకు లేదు. అందుకే గత ఏడాది నుంచీ నేనే ఒంటరిగా వెళ్తున్నా’ అంటోంది మౌనిక. ‘పదులసంఖ్యలో అంతర్జాతీయ పతకాలు నెగ్గి రాష్ట్రానికి, దేశానికి ఎంతో పేరు తీసుకొచ్చినా.. అంతర్జాతీయ పోటీలకు వెళ్లాలంటే ఇప్పటికీ దాతలు ఆదుకోవాల్సిన పరిస్థితే. ప్రభుత్వం తన ప్రతిభ గుర్తించి సహకరిస్తే బాగుంటుంది’ అంటున్నారు మౌనిక అమ్మానాన్నలు.
- 2014లో చైనాలో నిర్వహించిన ఏషియన్ చెస్ ఫెడరేషన్ విజేత. అదే ఏడాది ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (డబ్ల్యూకేఎం) హోదా.
- వరల్డ్ స్కూల్స్ చెస్ ఛాంపియన్‌షిప్, బ్రెజిల్ పోటీలో రన్నరప్.
- సింగపూర్‌లో 2015లో నిర్వహించిన ఏషియన్ ఏజ్ గ్రూప్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మూడు బంగారు, రజత, కాంస్య పతకాలు. ఉమెన్ ఫిడే మాస్టర్ (డబ్ల్యూఎఫ్‌ఎం) టైటిల్.
- 2019లో దిల్లీలో జరిగిన దిల్లీ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మొదటి ఉమెన్ ఇంటర్నేషనల్ నార్మ్ సాధించింది.
- 2021లో వరల్డ్ యూత్ ఆన్‌లైన్ గ్రాండ్‌ప్రిక్స్ సిరీస్‌లో రెండోస్థానం.
- తాజాగా స్పెయిన్‌లో నిర్వహించిన రాక్‌స్టార్స్ చెస్ ఫెస్టివల్ పోటీల్లో మూడో నార్మ్ సాధించి, ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: రద్దీగా ముచ్చింతల్ దారులు.. సమాతామూర్తిని దర్శించుకున్న భక్తులు