ఎవరీ బాషాభాయ్.. ఏమిటా కథ
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన బాషాభాయ్ అసలు పేరు ఫయాజ్ షరీఫ్. చిన్న దొంగగా జీవితం ప్రారంభించి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ స్థాయికి ఎదిగిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం కొల్లగొట్టాడు. బెంగళూరులోని కటిగనహళ్లి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని భారీ మొత్తంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ స్మగర్ల్ హసన్‌కు ప్రధాన అనుచరుడైన బాషా.. ఏపీలో రాయలసీమ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి విదేశాలకు తరలించడంలో సిద్ధహస్తుడు.
ముఖ్యంగా కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలు, స్థానిక గ్యాంగులు అతనికి సుపరిచితం. 2015లో కడప జిల్లాలో భారీ మొత్తంలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం తరలిస్తూ దొరికాడు. ఐదేళ్ల కాలంలో సుమారు వెయ్యి టన్నుల ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు రికార్డుల్లో ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో 62 స్మగ్లింగ్ కేసులున్నాయి. పులివెందుల కోర్టు బాషాతోపాటు ఆరుమంది కడప జిల్లా స్మగ్లర్లకు మూడేళ్ల జైలుశిక్ష, పది వేలు జరిమానా విధించింది.
మూడేళ్ల తరువాత విడుదలై బెంగళూరు వెళ్లిపోయాడు బాషా. మళ్లీ స్మగ్లింగ్ కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. భారీ ఎత్తున అక్రమ రవాణా చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్‌గా ఎదిగాడు. బాషా కోసం పోలీసులు మళ్లీ వేట మెుదలుపెట్టారు. బెంగళూరులోని కటిగనహళ్లిలోని తన డెన్‌లో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం నిల్వలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేశారు. ఆకస్మిక దాడికి కౌంటర్‌గా బాషా గ్యాంగ్ పోలీసులపై తెగబడింది. రాళ్లతో దాడికి పాల్పడింది. అయితే ఎట్టకేలకు బాషాతోపాటు అయిదు మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్వ ఉంచిన ఐదు కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో బెయిల్‌పై విడుదలైన బాషా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలతో బాషా వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. కడప శివారులోని వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన ప్రమాద ఘటనలో ఐదుగురు తమిళ కూలీలు మృత్యువాతపడ్డారు. దీనికి ప్రత్యక్ష సూత్రధారి బాషాగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక పోలీసు బృందాలు బెంగళూరు వెళ్లి అదుపులోకి తీసుకున్నాయి. స్థానిక లోకల్ హైజాక్ గ్యాంగ్ సాయంతో బాషాను అదుపులోకి తీసుకున్నారు. కడప శివారులోని రహస్య ప్రదేశంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టే వీలుంది.
ఇదీ చదవండి: కేసీఆర్ నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారు: వివేక్