ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని... రాజధాని రైతులు కదిలారు. మొన్న మద్రాసు మీది కాదు పొమ్మన్నారు.. నిన్న హైదరాబాద్‌పైనా ప్రేమను తెంచుకోమన్నారు.. తరాలుగా రాజధాని శాపం వేధిస్తున్న వేళ.. మనదైన రాజధాని కావాలని యావత్ ఆంధ్రావని బలమైన సంకల్పంతో.. అమరావతి నిర్మాణానికి పునాది రాయి పడింది. కానీ.. అదే సమాధి రాయిగా మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆంధ్రులు కలలోనూ ఊహించలేదు! సొంతవాళ్లే రాజధానిని కూల్చే సాహసం చేస్తారని పసిగట్టలేదు! ఈ ఊహాతీతమైన చర్యవల్ల కలిగిన బాధను పంటి బిగువు భరిస్తూ.., భయాన్ని గుండెల్లోనే దాచుకుంటూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు జనాల్లోకి కదిలారు.
600 రోజులకు పైబడి అప్రతిహతంగా సాగుతున్న దీక్ష.. కేవలం పాతిక ఊళ్లకే పరిమితమైందన్నారు. కానీ.. ఇవాళ మొదలుపెట్టిన పాదయాత్ర(Amaravati padayatra).. కడలి తరంగమై ఉవ్వెత్తున ఎగసిపడుతోందని, ఆ సజీవ సాక్ష్యాన్ని చూడమని కోరుతున్నారు రైతులు. రాజధాని అమరావతిపై జనాల్లో ఉన్న ఆశ, ఆకాంక్ష స్థాయి ఏంటన్నది రైతులు, మహిళల పాదయాత్ర బయటపెడుతోందని అంటున్నారు. దారిపొడవునా పూల స్వాగతం.. జనాల నీరాజనమే అమరావతిపై వారికున్న ప్రేమను చాటిచెబుతున్నాయి. అధికార పక్షం మినహా.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల సంపూర్ణ మద్దతుతో అమరావతి మహా పాదయాత్ర రణన్నినాదాన్ని తలపిస్తూ.. దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమ శంఖారావం చేస్తూ ముందుకు సాగుతోంది.
అవును మరి.. ముప్పై వేల ఎకరాలకు పైబడిన మూడు పంటలు పండే భూములను తమ భవిత కోసం.. కాదు కాదు రాష్ట్ర భవిష్యత్ కోసం సమర్పించారు. కష్టం.. నష్టం.. ఎదురైనా మన రాజధాని కోసం.. మన రాష్ట్రం కోసమేనని భరించారు. కానీ.. అర్థంతరంగా రాజధాని మార్చేస్తున్నట్టు ప్రకటించడంతో కలలు కల్లలయ్యానని, తాము చేసిన త్యాగాలకు అర్థమే లేకుండా పోయిందన్నది సగటు అమరావతి రైతు వేదన. అందుకే రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడిచిపోతున్నా.. మొక్కవోని, పట్టుసడలని ఉద్యమం కొనసాగిస్తున్నారు. రాజు మారినప్పుడల్లా.. రాజధానిని వెంటబెట్టుకెళ్లిన తుగ్లక్ తీరును అంగీకరించేది లేదని, ఆమోదించేది లేదని పోరుబాట పట్టారు.
తమ న్యాయమైన పోరాటానికి.. రాష్ట్ర భవిష్యత్ కు.. అటు న్యాయస్థానం, ఇటు దేవస్థానం అండగా ఉంటాయని, ఉండాలని చేపట్టిన 45 రోజుల సుదీర్ఘ పాదయాత్రకు ప్రజలు సైతం వెన్నంటి నిలుస్తున్నారు.. నడుస్తున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఇప్పటి వరకు ఏడు రోజులపాటు సాగిన పాదయాత్ర.. ఆదివారం సాయంత్రం ఇంకొల్లులో ముగిసింది. ఇవాళ కార్తీక సోమవారం సందర్భంగా యాత్రకు విరామం ఇచ్చారు. మంగళవారు తిరిగి యథావిధిగా ప్రారంభమవుతుంది. పోలీసు ఆటంకాలు ఎదురైనా, మరేవిధమైన అడ్డంకులు సృష్టించినా.. లక్ష్యం చేరే వరకూ యాత్ర ఆగబోదని రైతులు, మహిళలు తేల్చి చెబుతున్నారు.
ఇదీ చూడండి: 4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి