Amaravati JAC Action Plan : మూడు రాజధానుల విషయంలో తమ వాదనకే కట్టుబడి ఉన్నామన్న ఏపీ సీఎం ప్రకటన అమరావతి రైతుల్లో మళ్లీ గుబులు రేపుతోంది. రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేసి.. రాజకీయ లబ్ధి పొందేందుకే వైకాపా ప్రభుత్వం యత్నిస్తోందని.. అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఆరోపిస్తున్నారు. అమరావతి విషయంలో దాఖలైన పిటిషన్లపై ఇటీవల హైకోర్టు 300 పేజీలకుపైగా స్పష్టమైన తీర్పునిచ్చింది. అందులో ఒకటి, రెండు అంశాలపైనే చర్చించటం ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి శాసనాధికారం లేదని కోర్టు చెప్పినట్లు వక్రీకరించటం సరికాదని ఐకాస నేతలు మండిపడ్డారు.
రైతులు ప్రస్తుతం సేవ్ అమరావతి నినాదాన్ని బిల్డ్ అమరావతిగా మార్చి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు అమరావతికి కొంతైనా నిధులు కేటాయించాలి కదా అని నిలదీస్తున్నారు. హైకోర్టు ఆదేశాల్ని సీఆర్డీఏ అమలు చేయకపోతే ధిక్కార పిటిషన్ దాఖలు చేస్తామని... రైతులు ప్రకటించారు. అన్ని రాజకీయ పక్షాలతోనూ భేటీ నిర్వహించి పోరాట ప్రణాళిక రూపొందిస్తామని అమరావతి పరిరక్షణ సమితి కో-కన్వీనర్ గద్దె తిరుపతిరావు తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు... రెండ్రోజుల్లో ఐకాస నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి అవసరాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు మరోయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రాజధాని ఐకాస తరపున ఓ బృందం త్వరలో దిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవనుంది.
- ఇదీ చదవండి : ఆ రోజుల్లో కూడా తగినంత బొగ్గు సరఫరా చేయాలి