Amaravati meeting in Tirupati: అమరావతి అందరిదీ అంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా కదం తొక్కారు రైతులు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకుని.. తిరుపతిలో రాజధాని పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలతో సభా ప్రాంగణం.. జనసంద్రమైంది. అమరావతి రైతులకు మద్దతుగా ప్రజలు ఆకుపచ్చ కండువాలు.. మెడలో వేసుకుని సభకు వచ్చారు. జై అమరావతి అంటూ నినదించారు. కళాకారులు ఉద్యమగీతాలు ఆలపించగా.. రైతులు, మహిళలు ఆకుపచ్చ కుండువాలు గాల్లో తిప్పుతూ గొంతుకలిపారు.
Amaravati Farmers Public Meeting: అమరావతిని ఒకసామాజిక వర్గానికి అంటగట్టడాన్ని తిప్పికొడుతూ సభను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించారు. రాజధానికి భూములిచ్చిన వివిధ వర్గాల రైతులు.. పాదయాత్రలో తమకు ఎదురైన కష్టాలను వివరిస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. రాష్ట్రం భవిష్యత్ కోసం వేల ఎకరాల భూములిచ్చిన తమపై ప్రభుత్వం కక్షగట్టిందని మహిళలు వాపోయారు. భవిష్యత్ పోరాటంలో.. తమకు అండగా నిలవాలని.. విజ్ఞప్తిచేశారు.
హాజరైన రాజకీయపక్షాలు.. ప్రభుత్వంపై విమర్శలు
అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని అమరావతి మహోద్యమ సభకు హాజరైన వివిధ రాజకీయ పార్టీల నేతలు.. ముక్తకంఠంతో నినదించారు. వైకాపా, సీపీఎం మినహా అన్నిపార్టీల నేతలూ సభకు హాజరై.. రైతుల త్యాగం వృథా కాబోదని భరోసా ఇచ్చారు. ఇది తెలుగుదేశం సభంటూ మంత్రులు చేసిన విమర్శలపై.. నేతలు మండిపడ్డారు.
అమరావతిపై ఎందుకు మాట తప్పారు..? - చంద్రబాబు
chandrababu speech in Meeting: అమరావతి ఏ ఒక్కరిదో కాదని.. ప్రజారాజధాని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిపై సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో పాల్గొన్న బాబు.. ఎన్నికల ముందు ఏం చెప్పారో జగన్ గుర్తు తెచ్చుకోవాలన్నారు. మడమ తిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు.
ఎప్పుడైనా మునిగిందా..? - చంద్రబాబు
"అమరావతి ఉద్యమంలో 180 మంది చనిపోయారు. అమరావతి ఉద్యమకారులు 2,500 మందిపై కేసు పెట్టారు. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టిన ప్రభుత్వం ఇది. అమరావతి రైతులు చేసిన పాపం ఏమిటి ? హైదరాబాద్ అనుభవం ఉందని చెప్పి భూమి తీసుకున్నాం. అమరావతి ఉద్యమానికి అన్ని పార్టీలూ మద్దతిచ్చాయి. అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు. అమరావతి గట్టి నేల కాదని ప్రచారం చేశారు. మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా..? ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది." - చంద్రబాబు, తెదేపా అధినేత
రాజధాని వికేంద్రీకరణపై.. సీఎం జగన్ తీరును కాంగ్రెస్ నేత తులసిరెడ్డి తప్పుబట్టారు. అమరావతికి మద్దతుపై ఎక్కడా వెనక్కితగ్గేదిలేదని.. భాజపా, జనసేన నేతలు స్పష్టంచేశారు. రాజధాని ఏదంటే చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటని.. సీపీఐ నేతలు విచారం వెలిబుచ్చారు.
ఎప్పుడూ మాట మార్చలేదు - సీపీఐ నారాయణ
రాజధానిపై సీపీఐ ఎప్పుడూ మాట మార్చలేదు. అమరావతి అనే శిశువును జగన్ 3 ముక్కలు చేశారు. జగన్ లాంటి మూర్ఖుడు.. మరొకరు ఉండరు. మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు. ఉత్తరాదికి వెళ్తే మీ రాష్ట్ర రాజధాని ఏదని అడుగుతున్నారు. రాజధాని ఏదంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. రాజధాని అంటేనే అమరావతి రైతులు భూమి ఇచ్చారు - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ఉత్సాహంగా పాల్గొంటున్నాం - కన్నా లక్ష్మీనారాయణ
జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు. అమరావతి ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని అమిత్ షా అడిగారు. అమిత్ షా పిలుపుతో మరింత ఉత్సాహంగా పాల్గొంటున్నాం - కన్నా లక్ష్మీనారాయణ, భాజపా నేత
అమరావతి ఎక్కడకూ పోదని రెండేళ్లు ఓపిక పట్టాలని ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ నటుడు శివాజీ ధీమా వ్యక్తంచేశారు. హైకోర్టు అనుమతి మేరకు.. సాయంత్రం ఆరు గంటలకే సభను ముగించారు.