హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని శ్రీ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగపుత్ర దివస్‌గా జరుపుకోనున్నట్లు గంగ తెప్పోత్సవం ఛైర్మన్ పూస నరసింహ బెస్త వెల్లడించారు. తిలక్‌నగర్ సంఘం అధ్యక్షుడు కాపరవేని లింగం బెస్త నేతృత్వంలో వచ్చే శనివారం ఉదయం పది గంటలకు గోల్నాక చేపల మార్కెట్ వద్ద వేడుకలు నిర్వహిస్తామన్నారు. అంబర్‌పేట తిలక్‌నగర్ పరిధిలో ఉన్న గంగపుత్రులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
సర్కార్ కుట్ర..
సాంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రుల మీద ఇతర కులాలు, ప్రభుత్వం కుట్ర పన్నుతున్నాయని నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుల ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే గంగపుత్ర దివస్‌ను ప్రతి గంగపుత్ర సంఘం పండగలా వేడుకలు జరుపుకోవాలన్నారు. తమ కుల దైవం గంగాదేవికి పసుపు, కుంకుమ సమర్పించి గంగపుత్రులను చల్లగా చూడాలని కోరతామన్నారు.
మత్స్య సంపద పెరగాలని..
అలాగే రాష్ట్రంలోని చెరువులు నిండి అధిక మత్స్య సంపద పెరగాలని తల్లిని మొక్కుకోనున్నట్లు స్పష్టం చేశారు. గత నెల్లో రాజధానిని కుదిపేసిన వరదల వల్ల జనజీవనం అతలాకుతలం అయ్యిందని గుర్తు చేశారు. గండిపేట చెరువులో గంగమ్మ తల్లికి తాము తెప్పోత్సవం నిర్వహించాకే నగరంలో వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని నరసింహ వివరించారు.
దుబ్బాకలో గుణపాఠం..
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో ముగ్గురు గంగపుత్రులు బరిలో దిగి ఓట్లు చీల్చారని ఆయన వెల్లడించారు. తెరాస ఓటమికి గంగపుత్ర అభ్యర్థులే ప్రధాన కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గంగపుత్రులకు ప్రభుత్వాలు అన్యాయం చేయడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు నరసింహ తెలిపారు. తెరాస సర్కార్ అక్రమంగా తెచ్చిన జీఓ నెం. 6ను వెంటనే రద్దు చేయాలని నరసింహ బెస్త డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు వినతి..
అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామని సంఘం అధ్యక్షుడు లింగం బెస్త పేర్కొన్నారు. ఏటా గంగపుత్ర దివస్‌ను ఘనంగా నిర్వహించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చేపల వృత్తిలో బెస్తలకే తొలి హక్కు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగానే జీఓ 6ను రద్దు చేయాలన్నారు. ఈ మేరకు వెంటనే జీఓ జారీ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.