వాయు కాలుష్యం వల్ల హృదయం, రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదముందని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా పక్షవాతం, గుండెపోటు ఎక్కవయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాలుష్య తీవ్రత, హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల మధ్య సంబంధాన్ని విశ్లేషించేందుకుగాను ‘కార్డియోవాస్క్యులర్ హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ తెలంగాణ, ఇండియా(సీహెచ్‌ఏఐ)’ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం తాజా అధ్యయనాన్ని నిర్వహించింది. చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం(ఎస్‌ఆర్‌యూ) పరిశోధకులూ ఇందులో పాలుపంచుకున్నారు.
పరిశోధకుల అధ్యయనం - అంశాలు
- హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన 3,372 మందిలో ‘కార్టాయిండ్ ఇంటిమా - మీడియా థిక్‌నెస్ (సీఐఎంటీ)’ను తెలుసుకున్నారు.
- మెదడు, ముఖం, మెడ భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే గళ ధమని(కార్టాయిడ్ ఆర్టెరీ)కి చెందిన రెండు అంతర పొరల మందాన్ని సీఐఎంటీగా పిలుస్తారు.
- ఎక్కువగా వాయు కాలుష్యం బారినపడుతున్నవారిలో సీఐఎంటీ అధికంగా ఉంటోందని, వారికి హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పు తీవ్రమవుతోందని పరిశోధకులు గుర్తించారు.
- ఎక్కువగా 40 ఏళ్లు పైబడినవారిలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
వంట చేసే మహిళల్లో హృదయ సమస్యలు ఎక్కువ
సర్వే చేసిన వారిలో దాదాపు 60 శాతం మంది ఇళ్లలో వంటచెరకునే వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా వంట చేసే మహిళల్లో సీఐఎంటీ ఎక్కువగా ఉంటోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్(స్పెయిన్) శాస్త్రవేత్త ఒటావియో రంజానీ వెల్లడించారు.