వంట నూనెల ధరలు పెరిగే కొద్దీ కల్తీ అధికమవుతోంది. గత మార్చిలో కొవిడ్ సంక్షోభంతో లాక్‌డౌన్ పెట్టినప్పటి నుంచి ఇంకా ఎక్కువైంది. ఏప్రిల్ నుంచి జులై వరకు 1,11,352 కిలోల కల్తీ, నాసిరకం వంట నూనెలను తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య(టీఎస్ ఆయిల్‌ఫెడ్) పట్టుకుంది. ‘విజయ’ బ్రాండు పేరుతో ఈ సమాఖ్య చిల్లర మార్కెట్‌లో వంటనూనెలను విక్రయిస్తోంది. గుజరాత్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని నూనెమిల్లుల వ్యాపారులు లారీ ట్యాంకర్లలో వేరుశనగ, కొబ్బరి, నువ్వుల నూనెలు తెచ్చి నగర శివారులోని శివరాంపల్లిలో గల ఆయిల్‌ఫెడ్ శుద్ధి ప్లాంటులో విక్రయిస్తారు. ఇక్కడికి ట్యాంకర్ రాగానే అక్కడి సిబ్బంది నమూనాలు తీసుకుని ప్రయోగశాలలో తనిఖీ చేస్తారు.
ఆహార పదార్థాల్లో కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆయిల్‌ఫెడ్ వంట నూనెల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రమాణాల ప్రకారం లేకపోతే కల్తీ ఎలా చేశారో గుర్తించి ఆ ట్యాంకర్‌ను సమాఖ్య తిరస్కరిస్తుంది. ఇలా గత 4 నెలల్లో 11 ట్యాంకర్లను తిరస్కరించగా వాటి యజమానులు టోకు మార్కెట్లలో రాష్ట్రంలో అమ్మేసుకున్నారు. అంటే అది అడ్డదారిలో మన వంటింట్లోకి వచ్చేసినట్టే. కల్తీ అని గుర్తించడం వరకే తమ పని అని, దాన్ని సీజ్ చేసే అధికారం లేనందున తిరస్కరిస్తున్నట్లు ఆయిల్‌ఫెడ్ వర్గాలు తెలిపాయి.
మచ్చుకు కొన్ని కల్తీ లీలలు
జూన్ 16న ఓ ట్యాంకర్‌లో 10 వేల లీటర్ల కొబ్బరినూనె వచ్చింది. కానీ ఇందులో ఇతర నూనెలు కలిసినట్టు తేలింది. ఆగస్టు 30న మరో ట్యాంకర్‌లో 10 వేల లీటర్ల వేరుశనగ నూనె వచ్చింది. ఇతర నూనెలు కలపడంతో కొవ్వు పదార్థాలు, తేమ అధికంగా ఉన్నాయి.