ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీఎస్ నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 31వ తేదీన ఆదిత్యనాథ్ దాస్ తదుపరి సీఎస్‌గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.
ఈనెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నినీ ఏపీ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. వైద్యారోగ్యం కొవిడ్ మేనేజ్మెంట్తో పాటు కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, గ్రామ సచివాలయాల బలోపేతం తదితర అంశాలను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ కేడర్‌కు బదిలీ అయిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమెను ఏపీ పురపాలక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామల రావును ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖలో పని చేస్తున్న కె.సునీతను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సాంఘిక సంక్షేమ సహకార ఆర్థిక కార్పొరేషన్ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇదీ చదవండి: 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'