81st Numaish: 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నాంపల్లిలో అట్టహాసంగా ప్రారంభం కానుంది. నేటి నుంచి మార్చి 31 వరకు ఈ ప్రదర్శన సాగనుంది. సుమారు 20 ఎకరాల్లో 1400 స్టాళ్లు కొలువుదీరాయి. జనవరి 1న నుమాయిష్ ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా ఆ మరుసటి రోజే మూసేశారు. దీంతో స్టాళ్లు ఏర్పాటు చేసుకున్న వివిధ రాష్ట్రాల వ్యాపారులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. పరిస్థితులు మెరుగవ్వడం వల్ల తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నారు.
ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తి చేసింది. కశ్మీర్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బంగా తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. నుమాయిష్ ప్రారంభమవుతుండడంతో ఆయా స్టాళ్ల నిర్వాహకులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగనుంది.
కొవిడ్ నిబంధనలు తప్పనిసరి..
ప్రదర్శనకు వచ్చే సందర్శకులు కొవిడ్ నిబంధనలకనుగుణంగా విధిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఎగ్జిబిషన్ సొసైటీ సూచిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్టాళ్ల నిర్వాహకులందరూ తమ దుకాణాల్లో విధిగా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని సొసైటీ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం స్టాళ్ల మధ్య దూరం పెంచడంతో పాటు రోడ్లు కూడా వెడల్పు చేసినట్టు సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు.
మరో నెల రోజుల పాటు..!
రాబోయేది రంజాన్ మాసం కావడంతో స్టాళ్ల నిర్వాహకులు నుమాయిష్‌ను మరో నెల రోజుల పాటు పొడిగించాలని సొసైటీని కోరుతున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నుమాయిష్ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఇదీ చూడండి: