హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో వరద తీవ్రతను పసిగట్టిన 8 మంది కుటుంబం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. గగన్‌పహాడ్‌కు చెందిన అఫ్జల్ బేగంకు ముగ్గురు కొడుకులు. ఆమె సహా కొడుకులు, కోడళ్లు, వారి పిల్లలు కలిపి 8 మంది ఒకే ఇంట్లో ఉంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి వీరి ఇంటి పక్క నుంచి వరద వెళుతుంది.
ఈసారి అఫ్జల్ బేగంకు అనుమానమొచ్చింది. ఇది మామూలు వరద కాదు. చెరువు కట్ట తెగినట్లు ఉందని కుటుంబాన్ని హెచ్చరించింది. ఊహించినట్లుగానే వరద వచ్చేసింది. వెంటనే అందరూ చేతులు పట్టుకొని బయటపడ్డారు. ఓ భవనంపై రాత్రంతా గడిపారు. మరుసటి రోజు సాయంత్రానికి వరద తగ్గింది. ఇంట్లోని నగదు, 5 క్వింటాళ్ల బియ్యం, పప్పులు, ఉప్పులు, కొత్త కోడలు తెచ్చిన సామగ్రి తడిసి ముద్దయ్యాయి. ద్విచక్ర వాహనం బురదలో కూరుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలామని అఫ్జల్ బేగం కన్నీరుమున్నీరైంది.
వేడుకకు వెళ్లడం వల్లే తప్పించుకొన్నారు
అఫ్జల్ బేగం ఇంటికి సమీపంలోని మరో కుటుంబంలోని అయిదుగురు అదృష్టవశాత్తు వరద తాకిడి నుంచి బయట పడ్డారు. జహీర్, యూసుఫ్ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. వరదలకు వీరి ఇంటిపక్కనే ఉన్న నివాసంలోని నలుగురు కొట్టుకుపోయారు. బంధువు ఇంట్లో వేడుక ఉండటంతో జహీర్, యూసుఫ్ మరో కుమారుడు వెళ్లారు. రెండు రోజుల క్రితమే మరో కుమారుడు, కోడలు అత్తారింటికి వెళ్లడంతో కుటుంబమంతా సురక్షితంగా బయటపడింది. తర్వాత రోజు వచ్చి గుడిసెను చూసి లబోదిబోమన్నారు.