రాష్ట్రంలో లాక్‌డౌన్ కాలంలో ఉద్యోగార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఉపాధి సేవా(ఎన్‌సీఎస్) కింద ఉద్యోగాల కోసం గడిచిన మూడు నెలల్లోనే 47,145 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగార్థులు, ఉద్యోగాలిచ్చే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో కేంద్రం జాతీయ ఉపాధి సేవాను ఏర్పాటు చేసింది.
రికార్డు స్థాయిలో
రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.22 లక్షల మంది నిరుద్యోగులు దీంట్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే, లాక్‌డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే 47 వేల మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఉద్యోగార్థుల్లో 83 శాతం మందికి పైగా 34 ఏళ్లలోపు యువత ఉన్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగిన వారితో పాటు 17 మంది డాక్టరేట్లు (పీహెచ్‌డీ) ఉద్యోగార్థుల జాబితాలో చేరారు.
రాష్ట్రంలోని నియామక ఏజెన్సీలు గత మూడు నెలల్లో 1,371 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు