ఏపీలోని కడప జిల్లాలో వరద పోటు 12 మందిని బలిగొంది. రాజంపేట మండలం నందలూరు వెళుతున్న మూడు ఆర్టీసీ బస్సులు... వరదనీటిలో చిక్కుకు పోయాయి. నందలూరు సమీపంలో ఉదయం నుంచి వరదలోనే ఉన్న ఆర్టీసీ బస్సుల్లోని సిబ్బంది, కొందరు ప్రయాణికులు.... ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు.
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లా రాజంపేటలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. నందలూరు పరివాహన ప్రాంతాల్లోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో 3 ఆర్టీసీ బస్సులు వరద ఉద్ధృతిలో చిక్కుకుని కొట్టుకుని పోయిన ఘటనలో 30 మంది గల్లంతయ్యారు. వారిలో ఇప్పటి వరకు 12 మంది మృత దేహాలు లభ్యమయయ్యాయి. ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన సహాయక సిబ్బంది, అధికారులు మృతదేహాలను వెలికి తీశారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో ఒకరిని ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన కండట్కర్ అహోబిలం, చిట్వేలికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సుల్లోని కొందరిని మాత్రం అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
వరద ఉద్ధృతిలో బస్సులు కొట్టుకుపోయిన ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 30 మంది కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.
ఉప్పెనలా వస్తున్న వరద.. సహాయక చర్యలకు ఆటంకం
రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. పరివాహన ప్రాంతాల్లో వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు జలమయం అయ్యాయి. చెయ్యేరు నది నుంచి పోటెత్తుతున్న ప్రవాహం నందలూరు, రాజంపేట తదితర గ్రామాలను ముంచెత్తుతోంది. వరద ఉద్ధృతి వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: హెలికాఫ్టర్తో వాయుసేన రెస్క్యూ ఆపరేషన్.. 11మంది సేఫ్