Basara RGUKT : దేశంలో ఏడేళ్లకు పైగా శాశ్వత ఉపకులపతి లేని ఏకైక విశ్వవిద్యాలయంగా బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక, వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) విమర్శల పాలవుతోంది. శాశ్వత ఉపకులపతిని నియమించాలన్నది విద్యార్థుల 12 డిమాండ్లలో ఒకటి. ఈ వర్సిటీకి 2010 ఫిబ్రవరి నుంచి 2015 ఫిబ్రవరి వరకు అయిదేళ్ల పాటు ఐఐటీ ఖరగ్‌పుర్‌కు చెందిన ఆచార్య ఆర్‌వీ రాజకుమార్ ఉపకులపతిగా వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి శాశ్వత ఉపకులపతి లేరు. రాజకుమార్ పదవీకాలం ముగిసిన అనంతరం రెండేళ్ల పాటు ఓయూ మాజీ వీసీ సత్యనారాయణ ఇన్‌ఛార్జి ఉపకులపతిగా పనిచేశారు.
2017 సెప్టెంబరులో అప్పటి ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ను ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీగా నియమించింది. ఆయన 2020 ఫిబ్రవరి వరకు పనిచేశారు. ఆ స్థానంలో ప్రస్తుతం సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న రాహుల్ బొజ్జాను నియమించారు. ఆయన నియమితులై రెండేళ్లు కావొస్తున్నా ఒకే ఒకసారి వచ్చి వెళ్లారని వర్సిటీ వర్గాలు, విద్యార్థులు చెబుతున్నారు. గత ఏడాది న్యాక్ బృందం వర్సిటీకి వచ్చినప్పుడు రాహుల్ బొజ్జా హాజరయ్యారు. తాజాగా మంత్రి వెంట వర్సిటీకి వచ్చారు. గత అయిదేళ్లుగా ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల వారు వర్సిటీకి సమయం కేటాయించలేని పరిస్థితి. న్యాక్ బృందం కూడా శాశ్వత వీసీని నియమించాలని సూచించినట్లు తెలిసింది. ‘ఒకటీ రెండేళ్లు శాశ్వత వీసీలు లేని వర్సిటీలు ఉన్నాయి గానీ.. ఇలా ఏడేళ్లకుపైగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల్లేవు’’ అని సెంట్రల్ వర్సిటీ మాజీ వీసీతో పాటు ఓయూ మాజీ వీసీ ఎస్.సత్యనారాయణ అంటున్నారు. ఆర్‌జీయూకేటీ మాజీ డీన్ సహా పలువురు ఆచార్యులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు.
* దేశంలో 401 వర్సిటీలకు న్యాక్ గుర్తింపు ఉంది. అందులో 223కు ‘ఏ’, ఏ ఫ్లస్, 162కు ‘బి’ గ్రేడ్ ఉండగా...కేవలం 16 వర్సిటీలకే ‘సి’ గ్రేడ్ దక్కింది. అందులో ఆర్‌జీయూకేటీ కూడా ఒకటి కావడం గమనార్హం. రాష్ట్రంలో 15 వర్సిటీలకు న్యాక్ గ్రేడ్‌లుండగా...‘సి’ గ్రేడ్ పొందిన వర్సిటీ ఇదొక్కటే.
నియామకానికి జాప్యమెందుకు?.. రాష్ట్రంలోని మిగిలిన వర్సిటీలకు భిన్నంగా ఆర్‌జీయూకేటీ చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం పాలకమండలి(గవర్నింగ్ బాడీ) ఓ విద్యావేత్తను కులపతిగా నియమిస్తుంది. ఆ కులపతి వీసీని నియమిస్తారు. రాష్ట్ర విభజన వరకు అమెరికాలోని కార్నెగి మెలన్ వర్సిటీ కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు రాజిరెడ్డి కులపతిగా వ్యవహరించారు. ఆ తర్వాత కులపతిని నియమించలేదు. 2015 ఫిబ్రవరి తర్వాత శాశ్వత వీసీ కూడా లేకుండాపోయారు. ఒక ప్రాంగణానికే కులపతి ఎందుకని.. రాష్ట్రంలోని మిగిలిన విశ్వవిద్యాలయాల మాదిరిగా గవర్నర్‌ను కులపతిగా చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ విధంగా చట్టంలో మార్పు చేయాలంటే శాసనసభ ద్వారా జరగాలి.
విశ్వవిద్యాలయాల చట్టాల పునఃసమీక్షపై 2018లోనే ఓయూ మాజీ వీసీ సులేమాన్ ఛైర్మన్‌గా కమిటీని నియమించగా ఆయన 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆర్‌జీయూకేటీకి కూడా గవర్నరే కులపతిగా ఉండాలన్నది ఆ కమిటీ సిఫార్సుల్లో ఒకటి. దానిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో గవర్నరుకు బదులు అన్ని వర్సిటీలకు కులపతిగా సీఎంని నియమించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా వర్సిటీకి ఉపకులపతిలేక...పర్యవేక్షణ కొరవడి విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఏడ్రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో ఎట్టకేలకు సర్కార్ దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లను దశలవారీగా నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో వారంపాటు విద్యార్థులు నిరవధికంగా చేసిన ఆందోళనను సోమవారం రాత్రి విరమించారు.