మండుటెండల్లో అడుగు తీసి అడుగు వేయలేని రాళ్ల దారిలో సుమారు రెండు కిలో మీటర్లు నడిచింది ఓ బాలింత. గ్రామంలోకి వాహనం వెళ్లడానికి సరైన రోడ్డు లేకపోవడంతో చంటిపాపతో కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మామిడిగూడ(జి) గ్రామంలో చోటుచేసుకుంది. మెస్రం కవితకు బుధవారం తెల్లవారుజామున పురుటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు రెండు కిలో మీటర్ల దూరంలోని మామిడిగూడ(ఏ) గ్రామానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లిలోని పీహెచ్‌సీకి ఆటోలో తీసుకెళ్లారు.
ఉదయం 8 గంటలకు పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో కేసీఆర్ కిట్ అందజేసి సుమారు ఒంటిగంట ప్రాంతంలో అంబులెన్స్‌లో ఇంటికి పంపారు. మామిడిగూడ(ఏ) గ్రామం నుంచి వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మండుటెండలో సుమారు 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. తెల్లవారుజామున గ్రామస్థుల సాయంతో రోడ్డు వరకు వచ్చినా తిరిగి పసిపాపతో నడిచే వెళ్లేటప్పుడు అష్టకష్టాలు పడ్డారు.
- ఇదీ చదవండి : 'ఫారెస్ట్ వాచర్స్'గా మన్య ప్రాంత మహిళలు