Cotton Crop in Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా ఐదున్నర లక్షల మంది వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తారు. జిల్లాలోని 14 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంలో సింహభాగమే పత్తి. సాధారణంగా పత్తి పంట కాలం 180 రోజులుకాగా... ఎర్ర నేలల్లో 140 రోజుల్లోనే చేతికొస్తుంది. జూన్, జులై నెలల్లో వానాకాలం అనుకూలంగానే ప్రారంభమవుతున్నప్పటికీ.. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో పంట దిగుబడి ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాది ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని భావించిన రైతులకు... చివరికి సగమే చేతికి అందింది. నష్టం వచ్చినా మరోదారి లేక ఈసారి కూడా వరుణుడిపై భారం వేసి... వానాకాలం పంటకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొందరు విత్తనాలు వేస్తున్నారు.
Cotton Crop in telangana : పత్తిరైతులు వానాకాలం పంటసాగుకు సిద్ధమవుతుండగా... ప్రభుత్వ పంట రుణాల పంపిణీ ప్రక్రియ గాడితప్పుతోంది. తొలకరి పలకరింపుతో విత్తనాలు వేసే సమయం వచ్చినప్పటికీ... వానాకాలం రుణ ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదు. రుణాల పంపిణీ ప్రక్రియలో బ్యాంకర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ... అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పట్టించుకోవడంలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వ్యవసాయంపైనే ఆధారపడుతుండటంతో... పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మద్దతుధరలు పెరిగితేనే మేలు జరుగుతోందని కర్షకులు అంటున్నారు.
ప్రాణహిత, పెన్‌గంగా, గోదావరి నదులతో మమేకమై ఉన్నప్పటికీ జిల్లాలో వ్యవసాయానికి సాగునీటి లభ్యత లేదు. చనాఖా-కోర్ట బ్యారేజీ, గడ్డెన్న ప్రాజెక్టులున్నప్పటికీ... వ్యవసాయానికి చుక్కనీరందించిందీలేదు. ఫలితంగా రైతులంతా వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.