కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్ల రూపాయలను ప్రదిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 కేంద్ర బడ్జెట్‌లో.. రైల్వే మూలధన వ్యయాన్ని భారీగా పెంచినట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2013-2014 బడ్జెట్‌తో పోలిస్తే.. ఇప్పుడు కేటాయించిన మొత్తం తొమ్మిది రెట్లు ఎక్కువని తెలిపారు. బొగ్గు, ఎరువులు, ఆహార ధాన్యాల రంగాల అభివృద్ధికి.., సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు వంద కీలకమైన రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. వీటిపై ప్రాధాన్య క్రమంలో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో రూ.15వేల కోట్ల ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండనున్నట్లు పేర్కొన్నారు.
రైళ్లలో ప్రజల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలతో మరో 1000 కోచ్‌లను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వీటిని రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్, తేజస్ వంటి ప్రీమియర్ రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఈ కోచ్‌లను ఆధునాతన రూపంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేయనున్నట్లు తెలిపారు.
రైళ్ల వేగాన్ని పెంచాలని, వందేభారత్ రైళ్లను మరిన్ని మార్గాల్లో ప్రవేశపెట్టాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకోనున్నట్లు బడ్జెట్ ద్వారా తెలిపింది. పాత రైల్వే ట్రాకులను మార్చేందుకు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు సంకేతాలిచ్చింది. పర్యటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా వంద విస్టాడోమ్ కోచ్‌లను తయారు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లు, సైడ్ ఎంట్రీతో కొత్తగా డిజైన్ చేసిన 4,500 ఆటోమొబైల్ క్యారియర్ కోచ్‌లు, 5,000 ఎల్ఎచ్బీ కోచ్‌లు, 58,000 వ్యాగన్ల తయారీకి కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది.