ETV Bharat / business

సంక్షేమమా? సంస్కరణలా? ఎన్నో సవాళ్ల మధ్య నిర్మలమ్మ పద్దు.. ఏ రంగం ఏం ఆశిస్తోందంటే? - union budget realty

పొంచి ఉన్న మాంద్యం ముప్పు, అధిక ద్రవ్యోల్బణం, 10 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ విస్తరణ వంటి సవాళ్ల మధ్య 2023-24 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. "రానున్నది సంక్షేమ పద్దా- లేక సంస్కరణలే ముద్దా" అనేది ఫిబ్రవరి 1న తేలిపోనుంది. ఓటర్లను మెప్పిస్తూనే ప్రగతికి బాటలు పరుస్తూ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సీతమ్మ కసరత్తులు చేస్తున్నారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే నూతన బడ్జెట్‌పై దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో లెక‌్కలు వేసుకుంటున్నారు. కొత్త పద్దుపై ప్రజలు ఆశిస్తున్నదేమిటో ఒకసారి చూద్దాం.

union-budget-2023
union-budget-2023
author img

By

Published : Jan 30, 2023, 3:53 PM IST

ఆసేతు హిమాచలం ప్రతి పౌరుడిపై ప్రభావం చూపే బడ్జెట్‌కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.. పార్లమెంటులో వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సగటు వేతన జీవి నుంచి ఉన్నతోద్యోగుల వరకూ, చిరువ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తల వరకు ప్రతి ఒక్కరూ తదుపరి బడ్జెట్‌పై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. సీతమ్మకు మా మనవి అంటూ ప్రతి రంగం నుంచి ఎన్నో వినతులు, ప్రతిపాదనలు అందాయి. వాటన్నిటినీ క్రోడీకరించి చూస్తే ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే సమతుల్యమైన బడ్జెట్‌ను.. ప్రవేశపెట్టడం సవాలే. వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి... మోదీ నేతృత్వంలోని భాజపా సర్కార్‌కు ఇదే పూర్తిస్థాయి బడ్జెట్‌కానుంది. ఈ నేపథ్యంలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు కావాల్సిన రోడ్‌మ్యాప్‌ను ప్రస్తుత బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తక్కువ వడ్డీ రుణాలు.. పీఎల్ఐ విస్తరణ?
కరోనా అనంతరం దేశంలో అనేక రంగాల్లో ఉపాధిపై పెను ప్రభావం పడింది. నిరుద్యోగిత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి తయారీ, సాంకేతికత, మౌలిక సదుపాయాల పరిశ్రమలకు కేంద్రం ఈ బడ్జెట్‌లో ఊతమిస్తుందని ఆయా వర్గాలు ఆశిస్తున్నాయి. స్థిరమైన ఉద్యోగాలు కల్పించే నిర్ణయాలు బడ్జెట్‌లో ఉండాలని యువత కోరుకుంటోంది. మూలధన వ్యయం పెంపు, ఉద్యోగాలు సృష్టించేందుకు.. రూ.5వేల కోట్లకంటే తక్కువ పెట్టుబడులు కలిగిన ప్రాజెక్టులకు 10ఏళ్లు పన్ను మినహాయించాలని కేంద్రానికి పరిశ్రమల ప్రతినిధులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించేలా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకం (పీఎల్ఐ)ని మరిన్ని రంగాలకు విస్తరించాలని అభ్యర్థిస్తున్నారు.

మధ్యతరగతికి ఊరట దక్కేనా?
కొవిడ్‌ అనంతర పరిస్థితులు, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అధిక ద్రవ్యోల్బణం దేశ ప్రజలను పీడిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌, వంటనూనెలు సహా అనేక వస్తువుల ధరలు బాగా పెరిగాయి. అధికధరల వల్ల సంపాదించిన సొమ్ము అంతా ఖర్చులకే సరిపోతోంది. పొదుపు అనే మాటే సామాన్య ప్రజానీకానికి గగనమైపోయింది. ఈ నేపథ్యంలో వంట గ్యాస్‌, డీజిల్, పెట్రోల్‌ సహా నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మధ్యతరగతి కోరుతోంది. పట్టణీకరణ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉపాధి హామీ పథకం విస్తృతి, గ్రామీణ సడక్ యోజన, సాగునీటి పథకాలకు నిధులు పెంచి.. పల్లెసీమల ప్రగతికి మరింత ఊతమివ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

పన్ను పరిమితిపై ముందుకెలా?
వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈసారైనా బడ్జెట్‌లో మినహాయింపులు దక్కుతాయని ఆశిస్తున్నారు. కొన్నేళ్లుగా బడ్జెట్‌లో ఆదాయపు పన్నులో పెద్దగా ఊరట కల్పించలేదనేది వేతన జీవుల మాట. అయితే ఈసారి.. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించి కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఆరు స్లాబుల కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం 15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 2.5 లక్షల వార్షికాదాయంపై ఎలాంటి పన్నూ లేదు. 2.5 లక్షల నుంచి 5 లక్షల ఆదాయం కలిగిన వారికి 5 శాతం పన్ను వర్తిస్తోంది. 60-80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్‌ సిటిజన్లకు ఈ పన్ను పరిమితి 3 లక్షలుగా ఉంది. 80ఏళ్లు పైబడిన సూపర్‌ సీనియర్లకు 5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. 60 ఏళ్లు లోపు ఉన్నవారికి ఆదాయపు పన్ను పరిమితిని ఈసారైనా 5 లక్షలకు పెంచుతారని ఆశిస్తున్నారు.

400 వందే భారత్ రైళ్లు?
రైల్వే బడ్జెట్ అంటూ ప్రస్తుతం లేకపోయినా సామాన్య మానవులు మాత్రం పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచాలని కోరుకుంటున్నారు. చమురు ధరలకు అనుగుణంగా బస్సుల్లో టికెట్ల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలకు రైళ్లే ఆశాజనంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రద్దీ మార్గంలో మరిన్ని రైళ్లను ప్రవేశ పెట్టాలని కోరుతున్నారు. ఈ బడ్జెట్‌లో మరో 300-400 వందేభారత్‌ రైళ్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోనే వీటిని భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దూర ప్రయాణాలకు అనువుగా స్లీపర్‌ క్లాస్‌ వెర్షన్‌ను తీసుకొచ్చే అంశంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. డబుల్ లైన్లు, విద్యుదీకరణ, వేగానికి అనుగుణంగా పట్టాల సామర్థ్యం పెంపు వంటి కార్యక్రమాలకు కూడా నిధులు పెంచాలని వివిధ రాష్ట్రాలు కోరుతున్నాయి. బులెట్ ట్రైన్‌ ప్రాజెక్టుకు నిధులు పెంచే అవకాశం ఉంది.

ఈవీలకు దన్ను!
కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. 2022లో ఈవీ విక్రయాల్లో 210 శాతం వృద్ధి నమోదైంది. అయినప్పటికీ కర్బన ఉద్గారాలు వెలువరించే ఇంధనంతో నడిచే వాహన విక్రయాలే దేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈసారి బడ్జెట్‌లో విద్యుత్ వాహనాలపై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈవీల తయారీలో కీలకమైన బ్యాటరీలపై పన్ను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మౌలికవసతులకు ప్రత్యేక ప్రోత్సాకాలను కల్పిస్తే ఈవీల కొనుగోలు పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్‌ 80EEB ప్రకారం ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలు రుణాల వడ్డీపై కేంద్రం మినహాయింపులు కల్పించింది. వడ్డీపై ఈ మినహాయింపు లభించాలంటే 2023 మార్చి 31లోపు వాహనం కొనుగోలు చేయాలి. ఈ గడువును పొడిగించాలని నిపుణులు సూచిస్తున్నారు. విద్యుత్ వాహనాల కొనుగోలు చేసేవారికి కిలోవాట్‌కు రూ.15వేలు రాయితీ ఇచ్చే ఫేమ్‌-II పథకాన్ని 2024 మార్చి 31 తర్వాత కూడా కొనసాగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

రియాల్టీ రంగం కోరుకునేది ఇదే..
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే చర్యల్లో భాగంగా భారతీయ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. దానికి అనుగుణంగా బ్యాంకులు తాము అందజేసే వివిధ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీని వల్ల గృహ రుణాలను తీసుకున్న సామాన్యులపై మోయలేని భారం పడుతోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో గృహరుణాల చెల్లింపు భారాన్ని తగ్గించాలని సామాన్యులు కోరుతున్నారు. స్థిరాస్తి రంగానికి మరింత ఊతమిచ్చేందుకు గృహరుణాలకు ఇప్పుడు అందిస్తున్న వడ్డీ రాయితీని మరింత పెంచాలని రియాల్టర్లు కోరుతున్నారు. సిమెంట్, స్టీల్ ధరలను నియంత్రించి అందుబాటు బడ్జెట్‌లోనే గృహాలను అందించేలా చర్యలు తీసుకోవాలని స్థిరాస్తి సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

వైద్యానికి నిధులు పెంచుతారా?
దేశ జనాభాలో అత్యధికులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. డెల్టా వేరియంటే అయితే అనేకమంది ప్రాణాలు బలి తీసుకుంది. దేశ ప్రజల సంఖ్యకు అనుగుణంగా ఆరోగ్య మౌలిక వసతులు పెంచాల్సిన అవసరాన్ని కొవిడ్‌ మహమ్మారి చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మౌలిక వసతులను పెంచాలని నిపుణులు కోరుతున్నారు. కరోనా అనంతరం అనేక ఆరోగ్యసమస్యలు దేశ ప్రజలను చుట్టిముట్టాయి. అనేక మంది తమ సంపాదన సహా దాచుకున్నదంతా ఆసుపత్రులకే దారపోయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశ బడ్జెట్‌లో ఆరోగ్యరంగం వాటాను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. నూతన వైద్యవిధానాలు, పరిశోధనలకు నిధులు పెంచాలని కోరుతున్నారు. ఔషధ తయారీ రంగం సైతం మరిన్ని రాయితీలను కోరుతోంది. ప్రాణధార ఔషధాల తయారీకి అవసరమైన రసాయనాల దిగుమతిపై పన్నులు తగ్గించాలని వివిధ ఫార్మా సంస్థలు కోరుతున్నాయి.

బ్యాంకింగ్, రక్షణ విషయాలకొస్తే..
మాద్యం ఉరుముతున్న వేళ ఆర్థిక వ‌్యవస్థను కాపాడుకుంటూనే దేశ ప్రగతికి బాటలు పరచాల్సిన కఠిన పరిస్థితిని నిర్మలా సీతారామన్ ఎదుర్కొంటున్నారు. వార్షిక పద్దులో సంక్షేమ, అభివృద్ధి కలగలిపి సగటు ఓటరును మెప్పించేలా ప్రతిపాదనలు సమర్పించడం కేంద్రానికి పెను సవాలే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో సంస్కరణల కారణంగా ఎన్‌పీఏలు గణనీయంగా తగ్గాయని ఇటీవలే కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మెరుగైందన్నారు. కాబట్టి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే విపణిలో ద్రవ్యలభ్యతను పెంచేందుకు బ్యాంకులకు అందిస్తున్న మూలధన సాయం పెంచే అవకాశాలు ఉన్నాయి. చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో రక్షణశాఖకు నిధులు పెంచనున్నారు. భారత్ తయారీ విధానం ద్వారానే ఆయుధాలను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. రవాణా మౌలిక వసతుల పెంపు కోసం విమానాశ్రయాల నిర్మాణం, ప్రయాణ భద్రతపై బడ్జెట్‌లో దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. రహదారుల నిర్మాణం, విద్య, సాగునీటి ప్రాజెక్టులకు.. నిధులు పారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని ఎక్స్‌ప్రెస్‌వేలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.