Travel Now Pay Later : పండుగ సీజన్ సమీపిస్తోంది. అందరికీ తమ సొంత ఊళ్లకు వెళ్లాలని, లేదా నచ్చిన ప్రదేశానికి కుటుంబంతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లాలని ఉంటుంది. కానీ అందుకు సరిపడా సొమ్ము మన చేతిలో ఉండకపోవచ్చు. ఈ పరిస్థితిని గమనించిన ప్రముఖ ట్రావెలింగ్ అగ్రిగేటర్స్/ ట్రావెలింగ్ ఏజెన్సీలు.. 'ట్రావెల్ నౌ పే లేటర్' (TNPL) ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చాయి. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
TNPL అంటే ఏమిటి?
'బై నౌ పే లేటర్' స్కీమ్ లాంటిదే 'ట్రావెల్ నౌ పే లేటర్' (TNPL) కూడా. ప్రస్తుతం MakeMyTrip, Expedia లాంటి కొన్ని ట్రావెల్ అగ్రిగేటర్స్ ఈ టీఎన్‌పీఎల్ స్కీమ్‌లను అమలు చేస్తున్నాయి. ఇవి ముందుగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కస్టమర్లకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తాయి. తరువాత నిర్దిష్ట వ్యవధిలో ఆ డబ్బులను కస్టమర్ల నుంచి వసూలు చేసుకుంటాయి.
ఈఎంఐ సౌకర్యం ఉంది!
టీఎన్‌పీఎల్ విధానంలో కస్టమర్లకు ఈఎంఐ సౌకర్యం కూడా ఉంటుంది. అంటే రుణ మొత్తాన్ని.. నెలవారీ ఇన్స్టాల్మెంట్స్లో తిరిగి చెల్లించడానికిి అవకాశం ఉంటుంది. దీని వల్ల సదరు ప్రయాణికుడిపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
డబ్బులతో పని లేదు!
ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనాలన్నా లేదా ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా.. కచ్చితంగా అందుకు తగిన డబ్బులు మన దగ్గర ఉండాల్సిందే. లేకుంటే ఇక అంతే సంగతులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఎన్‌పీఎల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తరువాత.. సమయానికి చేతిలో సరిపడా డబ్బు లేకపోయినా ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం పెద్ద పెద్ద నగరాలు, టైర్-1, టైర్-2 సిటీల్లో మాత్రమే ఈ టీఎన్‌పీఎల్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాల్లోని వారు ఈ సౌకర్యాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు.
ఈ విషయంలో జాగ్రత్త!
TNPL Loan Interest Rate : మీరు కనుక టీఎన్‌పీఎల్ లోన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే.. ముందుగా కొన్ని విషయాలు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అది ఏమిటంటే.. టీఎన్‌పీఎల్ స్కీమ్స్ చాలా షార్ట్‌టైమ్ రీపేమెంట్ పీరియడ్స్‌ను కలిగి ఉంటాయి. అంటే చాలా తక్కువ సమయంలోనే.. మన ప్రయాణ ఖర్చులను కంపెనీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టీఎన్‌పీఎల్ స్కీమ్ వడ్డీ రేట్లు సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. సకాలంలో పేమెంట్ చేయకపోతే.. ఈ వడ్డీ మరింత పెరుగుతుంది. పైగా పెనాల్టీ సహా ఇతర రుసుములు కూడా కట్టాల్సి ఉంటుంది. అందుకే టీఎన్‌పీఎల్ స్కీమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం!
TNPL Loan Eligibility Criteria : సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం ఉన్నవారికి మాత్రమే టీఎన్‌పీఎల్ సౌకర్యం అందిస్తూ ఉంటారు. ఒక వేళ సకాలంలో కంపెనీలకు రీపేమెంట్స్ చేయకపోతే.. దాని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్‌పై కచ్చితంగా పడుతుంది.
లోన్ ఎంత వస్తుంది?
టీఎన్‌పీఎల్ లోన్స్ అనేవి కనిష్ఠంగా రూ.10,000 నుంచి ప్రారంభమై.. గరిష్ఠంగా చాలా పెద్ద మొత్తాల వరకు ఉంటాయి. ఈ టీఎన్‌పీఎల్ లోన్స్‌కు పెద్దగా పేపర్‌వర్క్ ఉండదు. అయితే, సాధారణంగా చిన్న రుణ మొత్తాలకు ఎలాంటి కొలేటరల్ లేదా గ్యారెంటీర్ ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ పెద్ద మొత్తంలో లోన్ కావాలంటే మాత్రం కచ్చితంగా గ్యారెంటీర్ లేదా కొలేటరల్‌ను చూపించాల్సి ఉంటుంది.
ట్రావెల్ లోన్స్!
ప్రస్తుతానికి టీఎన్‌పీఎల్ స్కీమ్ కింద గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు ట్రావెల్ లోన్ ఇస్తున్నారు. ఈ లోన్‌ను 6 ఏళ్ల గడువులోగా ఈఎంఐ రూపంలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే రుణగ్రహీతలు తమకు అనువైన రుణ మొత్తాన్ని, చెల్లింపు వ్యవధులను, ఇన్స్టాల్మెంట్ మొత్తాన్ని ఎంచుకోవచ్చు.
నోట్ : ఇక్కడ తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి ట్రావెల్ లోన్స్ తీసుకునేటప్పుడు.. మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.
Bank Holidays In October 2023 : అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్ ఇదే!