Top 5 Tips To Effectively Test Drive A New Car : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటే.. ముందుగా టెస్ట్ డ్రైవ్ చేయడం చాలా అవసరం. దీని వల్ల సదరు కారు మీ అవసరాలకు, అంచనాలకు తగ్గట్టుగా ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో ఎఫెక్టివ్‌గా కార్ టెస్ట్ డ్రైవ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
1. కోరుకున్న వేరియంట్‌నే డ్రైవ్ చేయాలి!
కారు డీలర్లు సాధారణంగా తమ షోరూమ్‌లో పరిమిత సంఖ్యలో టెస్ట్ డ్రైవింగ్ చేసే కార్లను అందుబాటులో ఉంచుతారు. కనుక మీరు కోరుకున్న కారు వేరియంట్ దొరకకపోవచ్చు. ఒక వేళ ఉన్నా.. రద్దీ సీజన్లలో వెంటనే టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం రాకపోవచ్చు. కనుక ముందుగానే డీలర్ వద్ద మీ స్లాట్ బుక్ చేసుకోవడం మంచిది. టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కచ్చితంగా మీరు కొనాలని అనుకుంటున్న వేరియంట్‌ను మాత్రమే డ్రైవ్ చేయాలి. లేకుంటే ఫలితం ఉండదు. ఉదాహరణకు.. మీరు Kia Seltos HTX plus iMT పెట్రోల్ వేరియంట్‌ను కొనాలని అనుకుంటే.. Kia Seltos HTX plus iMT డీజిల్ వేరియంట్‌తో టెస్ట్ డ్రైవ్ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే మీరు వెళ్లిన షోరూంలో మీరనుకున్న వేరియంట్ కారు లేకపోతే.. మరో షోరూంకు వెళ్లడమే మంచిది. ఈ విషయంలో కాంప్రమైజ్ కావడానికి వీలులేదు.
2. టెస్ట్ డ్రైవ్‌లో తొందర పడొద్దు!
టెస్ట్ డ్రైవ్ సమయంలో ఏమాత్రం తొందర పడకూడదు. సాధారణంగా డీలర్లు సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు మాత్రమే టెస్ట్ డ్రైవ్ చేయడానికి అనుమతి ఇస్తారు. కనుక మీకు ఇచ్చిన టైమ్ కంటే కాస్త ముందుగానే షోరూంకు వెళ్లడం మంచిది. దీనివల్ల పూర్తి స్థాయిలో కారును టెస్ట్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఆలస్యంగా వెళ్లి, హడావిడిగా టెస్ట్ డ్రైవ్ చేస్తే.. కారు పరిస్థితిని మీరు ఏ మాత్రం అర్థం చేసుకోలేరు. అందువల్ల టెస్ట్ డ్రైవ్ చేసినా ఫలితం లేకుండా పోతుంది.
3. పోల్చి చేసుకోవాలి!
మీరు కొనాలని అనుకుంటున్న కారును, ఇతర మోడళ్లతో పోల్చి చూసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఆయా కార్ల మెరిట్స్, డీమెరిట్స్ మీకు తెలుస్తాయి. వీలైనంత వరకు ఒకే రోజు రెండు రైవల్ కార్లను పోల్చి చూసుకోవడం మంచిది. అలా కాకుండా, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి టెస్ట్ డ్రైవ్ చేస్తే.. పెద్దగా ప్రయోజనం ఉండదు.
4. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లండి!
టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను తీసుకెళ్లడం చాలా మంచిది. ఎందుకంటే, వాళ్లు చాలా నిక్కచ్చిగా తమ ఫీడ్ బ్యాక్ ఇస్తారు. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? టెక్, సేఫ్టీ ఫీచర్లు ఎలా ఉన్నాయి? కారులో కూర్చోడానికి కంఫర్ట్‌గా ఉందా? కలర్ ఆప్షన్స్ సహా అన్ని అంశాలపై తమ అభిప్రాయాలను నిజాయితీగా చెబుతారు. దీని వల్ల మీరు సదరు కారు కొనాలా? లేదా? అనేది కూడా నిర్ణయించుకోగలుగుతారు.
5. ప్రాథమిక అంశాల్ని గమనించండి!
కారును టెస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ప్రాథమిక అంశాలపై ఫోకస్ పెట్టాలి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే ఇంజిన్, స్టీరింగ్ ఫీల్, ట్రాన్స్‌మిషన్, బ్రేక్స్, సీటింగ్ కంఫర్ట్.. ఇలా అన్నీ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా బ్రేకింగ్ సిస్టమ్‌పై దృష్టి సారించాలి. వేర్వేరు వేగాలతో వాహనం నడిపి, బ్రేకులు వేసి చూడండి. దీని వల్ల వాటి పనితీరు, సామర్థ్యం మీకు తెలుస్తాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్రైవర్ వైపు ఉన్న అన్ని ఫిజికల్ బటన్‌లను టెస్ట్ చేసి చూడాలి. తర్వాత వెహికల్ సేఫ్టీ ఫీచర్స్, మైలేజ్ గురించి విక్రయదారుల్ని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ అది ఎలక్ట్రికల్ కారు అయితే.. బ్యాటరీ ఛార్జింగ్ డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వమని అడగాలి. ఈ విధంగా మంచిగా టెస్ట్ డ్రైవ్ చేసి.. మీరు కోరుకున్న కారును కొనుక్కోవాలి.