Tax Reduction Techniques : మరో నాలుగు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. పన్ను భారం తగ్గించుకునేందుకు అవసరమైన పెట్టుబడులు పెట్టాల్సిన తరుణమిది. పన్ను మినహాయింపు ఒక్కటే లక్ష్యం కాకుండా.. పెట్టుబడులు భవిష్యత్తులో ఆర్థిక భరోసా కల్పించేలా ఉండాలి. సరైన పన్ను-పెట్టుబడి పథకంలో మదుపు చేసినప్పుడే ఇది సాధ్యం.
పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు పన్ను చెల్లించాలి. ఈ భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను చట్టం 1961 పలు మార్గాలనూ సూచిస్తోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెక్షన్ 80సీ. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్), అయిదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, జీవిత బీమా పాలసీల ప్రీమియం, ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రాలు (ఎన్‌ఎస్‌సీ), పెద్దల పొదుపు పథకం (ఎస్‌సీఎస్‌ఎస్), ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్‌ఎస్‌ఎస్), గృహరుణం అసలు, ఇద్దరు పిల్లలకు చెల్లించిన ట్యూషన్ ఫీజు తదితరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తాయి.
కొన్ని పథకాలు స్థిరంగా రాబడిని అందిస్తాయి. కానీ, దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు అది అంత గొప్పగా ఉండదు. పైగా వీటి నుంచి వచ్చిన రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
మార్కెట్ ఆధారిత పన్ను ఆదా పథకాలను ఎంచుకున్నప్పుడు కాస్త నష్టభయం ఉంటుందన్నది వాస్తవం. ఇందులో ముఖ్యంగా ఈఎల్‌ఎస్‌ఎస్, యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్)లాంటివి పరిశీలించవచ్చు. దీర్ఘకాలంలో వీటి వల్ల పెట్టుబడి వృద్ధికి అవకాశం ఉంటుంది. వచ్చిన రాబడిపైనా పన్ను భారం అంతగా ఉండదు.
మూడేళ్లు కొనసాగిస్తే..
మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తూ.. పన్ను ఆదా చేసుకునేందుకూ వీలుండాలనుకునే వారు ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) ఎంచుకోవచ్చు. వీటిలో పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగించాలనేది నిబంధన. సెక్షన్ 80సీ పెట్టుబడుల్లో తక్కువ వ్యవధి ఉన్నవి ఇవే. కొత్తగా ఉద్యోగంలో చేరి, ఫండ్లలో తొలిసారి మదుపు చేస్తున్న వారికి ఇవి అనుకూలం.
- ఒకే ఈఎల్‌ఎస్‌ఎస్‌ను ఎంచుకునే బదులు.. మంచి పనితీరున్న మూడు నాలుగు పథకాల్లో మదుపు చేయొచ్చు. దీనివల్ల వైవిధ్యంగా మదుపు చేసేందుకు అవకాశం కలుగుతుంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో మదుపు చేసే ఫండ్లను పరిశీలించండి.
- ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే 2-3 ఫండ్లను ఎంచుకొని, క్రమానుగతంగా మదుపు (సిప్) చేయాలి. ప్రతి సిప్ మొత్తానికీ మూడేళ్ల లాకిన్ వర్తిస్తుంది.
- మూడేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలన్న నిబంధన వల్ల మీరు మధ్యలోనే వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఉండదు. ఫలితంగా పెట్టుబడి వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. మూడేళ్ల వ్యవధి ముగుస్తున్నప్పుడు ఫండ్ పనితీరును పరిశీలించండి. బాగుంటే మొదటి నెలలో మదుపు చేసిన మొత్తాన్ని వెనక్కి తీసుకొని, తిరిగి పెట్టుబడి పెట్టండి. ఇలా చేయడం వల్ల కొత్తగా మీరు చేతి నుంచి డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెసులుబాటు లేనప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి. మీ దగ్గర మిగులు మొత్తం ఉంటే మదుపును క్రమం తప్పకుండా కొనసాగించడమే లాభదాయకం.
బీమా తోడుగా..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, బీమా రక్షణ ఒకేచోట అందించేవి యూనిట్ ఆధారిత బీమా పాలసీలు (యులిప్). పెట్టుబడి, రక్షణ విడివిడిగా నిర్వహించలేని వారికి ఇవి అనుకూలం. సాధారణంగా ఇవి 15-20 ఏళ్ల దీర్ఘకాలిక పథకాలు. మీ వయసు, ఎంత ప్రీమియం చెల్లించగలరు, వ్యవధి, వివిధ దశల్లో మీ అవసరాలు, తదితర వాటిని దృష్టిలో పెట్టుకొని, వీటిని ఎంపిక చేసుకోవాలి.
- మీరు చెల్లించే ప్రీమియానికి కనీసం 10 రెట్ల వరకూ బీమా పాలసీ ఉండేలా చూసుకోవాలి. 15-20 రెట్లు ఉంటే మరీ మంచిది.
- వివిధ లక్ష్యాలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక యులిప్ ఎప్పుడూ మంచిది. పాలసీ వ్యవధి ముగిసే వరకూ ప్రీమియం చెల్లించాలి. చాలా యులిప్‌లు ఈక్విటీ, డెట్ ఫండ్లను ఎంచుకునేందుకు దాదాపు 5-9 ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మీ లక్ష్యాలకు అనుగుణంగా వీటిని పరిశీలించవచ్చు. ఇందులో కొన్ని స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్లు ఉంటాయి. కొన్నింటిలో మల్టీ క్యాప్, థీమాటిక్ ఫండ్లూ అందుబాటులో ఉంటాయి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యాన్ని బట్టి, ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు మారేందుకు కొన్ని నిబంధనలకు లోబడి 'స్విచ్చింగ్' అవకాశం ఉంటుంది.
- కనీసం 10-15 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే యులిప్‌లను తీసుకోండి. పెట్టుబడుల్లో డైవర్సిఫైడ్ ఫండ్లకే ప్రాధాన్యం ఇవ్వండి. లక్ష్యం సమీపిస్తున్నప్పుడు ఈక్విటీ ఫండ్ల నుంచి పెట్టుబడిని డెట్ ఫండ్లలోకి మార్చండి. అయిదేళ్ల తర్వాత పాక్షికంగా కొంత పెట్టుబడిని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, సాధ్యమైనంత వరకూ ఈ వెసులుబాటును వాడుకోవద్దు.
పింఛను పథకంతో..
పన్ను ఆదాతోపాటు, పదవీ విరమణ తర్వాతా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్) మంచి ఎంపిక. ఈ పథకాన్ని పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రిస్తుంది. ఈ పథకంలో ముందుగా పెట్టుబడి పెడితే.. పదవీ విరమణ తర్వాత పింఛను తీసుకునేందుకు వీలవుతుందన్న మాట. ఎంత పింఛను వస్తుందనేది పెట్టుబడి మొత్తంపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రకంగా మార్కెట్ ఆధారిత పథకమే. కాబట్టి, రాబడికి కచ్చితమైన హామీ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే.. ఇతర పింఛను పథకాలతో పోలిస్తే ఎన్‌పీఎస్ ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.
- పదవీ విరమణ వరకూ జమ చేసిన మొత్తంలో నుంచి 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో ఎంపిక చేసిన ఏడు సంస్థల నుంచి యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవే పింఛనును చెల్లిస్తాయి.
- యాక్టివ్ ఛాయిస్, ఆటో ఛాయిస్ పేరుతో ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వయసు, నష్టభయాన్ని భరించే శక్తిని బట్టి, వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ, స్థిరాదాయం అందించే పథకాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రధానంగా ఉంటాయి.
- ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ.50వేల వరకూ ప్రత్యేక మినహాయింపు పొందేందుకు వీలుంటుంది.
ఇవీ చదవండి: