Tata Motors New Electric Vehicle: దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త విద్యుత్తువాహనాల కాన్సెప్ట్‌ను బుధవారం ఆవిష్కరించింది. సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన టాటా టిగోర్, నెక్సన్ ఈవీల తరహాలో దీన్ని జిప్‌ట్రాన్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించలేదు. దీనికోసం కొత్తతరం డిజైన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ కొత్త ఈవీ కాన్సెప్ట్‌ను టాటా కర్వ్‌గా వ్యవహరిస్తున్నారు.
- భద్రత, ఆధునికతతో పాటు అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ తద్వారా అధిక మైలేజీయే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణించేలా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది.
- 'లెస్ ఈజ్ మోర్' అనే డిజైన్ ఫిలాసఫీతో దీన్ని రూపొందించారు. భవిష్యత్తులో రానున్న ఈవీలన్నీ ఈ కాన్సెప్ట్ ఆధారంగానే తీసుకురానున్నారు.
- వెనుక భాగం ఎత్తుగా.. ఏటవాటు రూఫ్‌లైన్‌తో ‘కౌప్’ డిజైన్‌ను పోలి ఉండనున్నట్లు కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది.
- ఈ కొత్త కాన్సెప్ట్‌పై వాహనాన్ని తయారు చేసి విక్రయించడానికి రెండేళ్ల సమయం పడుతుందని టాటా మోటార్స్ ఈరోజు ఆవిష్కరణ వేడుకలో ప్రకటించింది.
- మిడ్‌సైజ్ ఎస్‌యూవీకి కంటే ఎక్కువ.. ప్రీమియం ఎస్‌యూవీకి తక్కువగా ఉండే కొత్త విభాగంలో టాటా కర్వ్‌ను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి వేరువేరుగా తెరలు ఇచ్చారు. ప్రస్తుతానికి వీటిని మాత్రమే బహిర్గతం చేశారు.
Maruthi Suzuki Price Hike: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కార్ల ధరలను పెంచనుంది. కొత్త ధరలు ఈ నెలలోనే అమల్లోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ, ముడి సరకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలోనే ధరల్ని పెంచనున్నట్లు తెలిపింది. గత ఏడాది కాలంగా పెరుగుతున్న ముడి సరకుల వ్యయాల వల్ల తమ వాహనాల ధరలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఫలితంగా కొంత భారాన్ని వినియోగదారుపై మోపక తప్పడం లేదని తెలిపింది. అయితే, ధరల పెంపు ఏ మేరకు ఉండనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. జనవరి 2021 నుంచి మార్చి 2022 మధ్య పలు దఫాల్లో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరిగాయి. ఈ మధ్య కాలంలో ధరలు 8.8 శాతం మేరకు ఎగబాకాయి. మరోవైపు మారుతీ సుజుకీ సుమారు 20వేల వాహనాలను రీకాల్ చేసింది. ఈకో మోడల్‌కు చెందిన వాహనాల్లో లోపాలను సరిదిద్దడానికి రీకాల్ చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆగని వడ్డన.. ముంబయిలో రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు