Stock Market Today: గత సెషన్లో భారీ నష్టాలు నమోదుచేసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్కరోజులోనే కోలుకున్నాయి. మంగళవారం దూసుకెళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఏకంగా 1564 పాయింట్లు పెరిగి.. 59 వేల 537 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 446 పాయింట్ల లాభంతో 17 వేల 759 వద్ద సెషన్‌ను ముగించింది.
- సోమవారం సెషన్లో 58 వేల దిగువన ముగిసిన సెన్సెక్స్.. నేటి సెషన్లో దాదాపు 300 పాయింట్ల లాభంతో 58 వేల 260 వద్ద ప్రారంభించింది. 58 వేల 245 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. క్రమక్రమంగా లాభాలను పెంచుకుంటూ వెళ్లింది. ఓ దశలో 1620 పాయింట్లకుపైగా పెరిగి చివరకు 59 వేల 537 వద్ద స్థిరపడింది.
- అన్ని రంగాల సూచీలు గణనీయంగా పుంజుకున్నాయి. ఆటో, బ్యాంకింగ్, లోహం, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్, రియాల్టీ రంగాలకు చెందిన సూచీలు 2-3 శాతం మేర రాణించాయి.
- సెన్సెక్స్ 30 ప్యాక్‌లో అన్ని మంచి లాభాలను గడించాయి. బజాజ్ ఫిన్సర్వ్ అత్యధికంగా 5 శాతానికిపైగా పెరిగింది. బజాజ్ ఫినాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పుంజుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా సోమవారం సెషన్లో భారీ నష్టాల నేపథ్యంలో.. కనిష్ఠాల వద్ద మదుపరులు కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్ల దూకుడుకు కారణమయ్యాయి. గత సెషన్లో సెన్సెక్స్ 861 పాయింట్లు, నిఫ్టీ 236 పాయింట్ల మేర కుదేలయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా గత సెషన్లో నష్టపోయాయి.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు బలంగా నమోదవుతుందన్న అంచనాలు.. మార్కెట్లలో లాభాలకు ఓ కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐరోపా మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడటం దేశీయ సూచీలకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు.
ఇవీ చూడండి: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ, అంబానీ ర్యాంకు ఎంతంటే
రిలయన్స్ విస్తరణ, భారీగా కొత్త పెట్టుబడులు, వారసులకు బాధ్యతలు