Stock Market Live Updates: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో ఆరంభంలోనే కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా పతనమైంది. ప్రస్తుతం 54 వేల 570 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 16 వేల 260 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో పవర్‌గ్రిడ్, మారుతీ మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలకు తోడు.. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో ఒత్తిడి మార్కెట్ల నష్టాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. దేశీయంగా రూపాయి బలహీనపడటం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెషన్ ఆరంభంలో రూపాయి 8 పైసలు క్షీణించి.. డాలర్‌తో పోలిస్తే 77.82కు చేరింది. ఇదే జీవనకాల కనిష్ఠం.
గురువారం అమెరికా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. ద్రవ్యోల్బణంపై అగ్రరాజ్యం నివేదిక వెలువడనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో డౌ జోన్స్ 1.94శాతం, ఎస్‌అండ్‌పీ సూచీ 2.38 శాతం మేర కుంగాయి. నాస్‌డాక్ కూడా 2.75 శాతం నష్టాన్ని చవిచూసింది. ఇది దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఆసియా మార్కెట్లన్నీ శుక్రవారం నష్టాల్లోనే ప్రారంభమవడం ఆందోళన కలిగిస్తోంది.