అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది హ్యుందాయ్ మోటార్స్. 'హ్యుందాయ్ అయానిక్ 5' ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నోయిడాలో జరుగుతున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించింది. బాలీవుడ్ బాద్షా, హ్యుందాయ్ ప్రచారకర్త షారుక్ ఖాన్ ఈ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన సూపర్‌హిట్ చిత్రం 'దిల్వాలే దుల్హానియా లే జాయేంగే'లోని 'తుజే దేఖా తో యే జానా సనమ్' పాటను ఆలపించారు.
అయానిక్ 5 కాన్సెప్ట్ మోడల్‌ను 2019లోనే ప్రదర్శించింది హ్యుందాయ్. కాన్సెప్ట్ మోడల్ కన్నా మరింత ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దింది. అయానిక్ 5ని ఒకసారి ఛార్జ్ చేస్తే.. నిరంతరాయంగా 631 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని కంపెనీ చెబుతోంది. గ్రావిటీ గోల్డ్ మాట్, ఆప్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో ఈ వాహనం అందుబాటులో ఉంది.
డిజైన్, ఫీచర్లు
'ఈ-జీఎంపీ' ప్లాట్‌ఫాంపై ఐయానిక్ 5ను రూపొందించారు. ఇదే ప్లాట్‌ఫాంపై తయారైన కియా ఈవీ6 వాహనం ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంది. విశాలమైన హెడ్లైట్లు, 20 అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ అలాయ్ చక్రాలు ఐయానిక్లో ఉన్నాయి.
- డాష్‌బోర్డ్‌పై 12.5 అంగుళాల ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ సిస్టమ్
- హెడ్స్ అప్ డిస్ప్లే
- ఏడీఏఎస్ సేఫ్టీ టెక్నాలజీ
- ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్ రీఛార్జ్ కోసం 3.6 కేవీ అవుట్‌పుట్
- 72.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్
- 800 వోల్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్
- 18 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80శాతం ఛార్జింగ్
గతేడాది డిసెంబర్ 21న ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభించింది హ్యుందాయ్. రూ.లక్ష పెట్టి బుక్ చేసుకోవచ్చు. తొలి 500 మంది వినియోగదారులకే ఈ అవకాశం. కారు ధరను (ఎక్స్‌షోరూం) రూ.44.95 లక్షలుగా నిర్ణయించింది హ్యుందాయ్. ఈ కారుతో పాటు 'అయానిక్ 6' మోడల్‌ను సైతం ఇదే ఎక్స్‌పోలో ప్రదర్శించిందీ సంస్థ. ఇది ఐరోపా, ఉత్తర అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.