SBI Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచడంతో, రుణ రేట్లతో పాటు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై(ఎఫ్డీ) వడ్డీ రేట్లనూ పెంచడం ప్రారంభించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డీలపై వడ్డీని 0.20 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈనెల 14 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 211 రోజుల నుంచి ఏడాది వ్యవధి డిపాజిట్లపై వడ్డీ ఇప్పుడున్న 4.40 శాతం నుంచి 4.60 శాతానికి చేరింది. 1-2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ 5.30 శాతం, 2-3 ఏళ్ల డిపాజిట్లపై 5.35 శాతం వడ్డీ లభించనుంది. సీనియర్ సిటిజన్లకు దీనిపై 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తుంది. దీంతోపాటు రూ.2 కోట్లపైబడిన డిపాజిట్లపై వడ్డీని 0.75 శాతం మేరకు పెంచింది.
- రెపో ఆధారిత రుణాల రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) 7.15 శాతానికి చేర్చినట్లు ఎస్బీఐ ప్రకటించింది. నిధుల వ్యయ ఆధారిత రుణ రేట్లను(ఎంసీఎల్ఆర్) కూడా 0.20 శాతం పెంచుతున్నామని తెలిపింది. నేటి నుంచి ఇవి అమల్లోకి వస్తున్నాయి.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1-10 ఏళ్ల డిపాజిట్లపై 10-35 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంచింది.
- రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25 శాతం వరకు ఈనెల 15 నుంచి పెంచుతున్నట్లు ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది.
ఇవీ చూడండి: రికార్డు స్థాయికి టోకు ధరల ద్రవ్యోల్బణం.. మే నెలలో 15.88%
జీవిత ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఆర్థిక ప్రణాళిక వేసుకోండిలా...