RBI Penalty On Banks 2023 : ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు వాటికి జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95కోట్లు చొప్పున జరిమానా వేసింది. రుణాల అడ్వాన్సులు- చట్టబద్ధమైన ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి తాము జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
ఆర్థిక సేవల అవుట్ సోర్సింగ్‌లో రిస్క్‌లు, ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, రికవరీ ఏజెంట్లు, కస్టమర్ సర్వీసుకు సంబంధించి నిర్దేశించిన నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు కోటక్ బ్యాంకుకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించనందుకు మాత్రమే రెండు బ్యాంకులకు జరిమానా విధించామని, ఖాతాదారుల లావాదేవీలకు ఈ జరిమానాలతో సంబంధం లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కూడా ఆర్‌బీఐ జరిమానా విధించింది.
సాధారణంగా, బ్యాంకులే ఖాతాదారులకు తరచుగా జరిమానాలు విధిస్తాయి. కానీ, బ్యాంకులకు సైతం ఇకపై జరిమానాలు సాధారణం కానున్నాయి. ఏటీఎంలలో నగదు నిల్వలు ఉంచకపోతే.. బ్యాంకులకు ఫైన్ వేయనుంది ఆర్‌బీఐ. అకౌంట్లో డబ్బులు డెబిట్ అయి, ఏటీఎం నుంచి డబ్బులు రాకపోవడం వంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఈ నియమాలను తీసుకొచ్చింది. విఫలమైన లావాదేవీలను టర్న్ అరౌండ్ టైమ్(టీఏటీ) పద్ధతిలో పరిష్కరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టపరిహారం సైతం చెల్లించాలని స్పష్టం చేసింది.
లావాదేవీ విఫలమైతే ఏం చేయాలంటే?
వినియోగదారులు ఎక్కడైనా ఏటీఎం వద్ద లావాదేవీలు నిర్వహించినప్పుడు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయి, ఏటీఎం నుంచి నగదు రాకపోతే సమస్యగా పరిగణించాలి. ఈ లావాదేవీల సమస్యలను బ్యాంకులు ఐదు రోజుల్లోపు పరిష్కరించాలి. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే వినియోగదారులకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాతి నుంచి రోజుకు రూ.100 చొప్పున బాధిత ఖాతాదారుడికి చెల్లించాలి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.