RBI KYC Guidelines : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఖాతాదారులు కేవైసీని అప్డేట్ చేసుకోవడం కోసం బ్యాంకులకు వెళ్లనక్కర్లేదని తెలిపింది. ఆన్లైన్లో రీ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.
సాధారణంగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా కేవైసీ వివరాలు బ్యాంకులకు సమర్పించాలి. బ్యాంకులు తరచూ ఈ వివరాలను అప్డేట్ చేయాలని ఖాతాదారుల్ని కోరుతుంటాయి. సకాలంలో కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకు.. ఖాతాదారుడి లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ఉంటుంది. ఖాతాదారులకు రీ-కేవైసీ చేయించడం ఓ సమస్యగా మారుతోంది.
ఖాతాదారుల ఇబ్బందుల్ని గుర్తించిన ఆర్‌బీఐ రీ-కేవైసీ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పించింది. కేవైసీ వివరాల్లో ఎలాంటి మార్పులు లేనట్టైతే రీ-కేవైసీ కోసం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కొత్తగా కేవైసీ చేసేవారికి సైతం ఆర్‌బీఐ ఊరట కల్పించింది. కేవైసీ కోసం వీలైతే బ్యాంకుకు వెళ్లొచ్చు లేదంటే వీడియోతో కూడిన కేవైసీను పూర్తి చేయవచ్చని పేర్కొంది.
'రిజిస్టర్డ్ ఈ-మెయిల్, మొబైల్ నంబరు, ఏటీఎంలు, మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ తదితరాల ద్వారా రీ-కేవైసీని పూర్తి చేసే సదుపాయాన్ని ఖాతాదారులకు బ్యాంకులు కల్పించాలి. చిరునామాలో ఏమైనా మార్పులున్నా, ఈ మార్గాల ద్వారా మార్చుకోవచ్చు. ఆన్లైన్లో సమర్పించిన రీ కేవైసీ ద్వారా రెండు నెలల్లోగా చిరునామాను బ్యాంకు నిర్ధరిస్తుంది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ కార్డ్, జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును సెల్ఫ్ డిక్లరేషన్‌కు వాడవచ్చు.'
--అర్బీఐ