PMKMY Scheme : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణలో రైతుబంధు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ రైతు భరోసా లాంటి పథకాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఇవన్నీ రైతులు వ్యవసాయం చేస్తున్నంత కాలం మాత్రమే అండగా నిలుస్తాయి. ఒకసారి రైతులు వృద్ధాప్యంలోకి వెళితే.. ఇవి అక్కరకు రావు. అప్పుడు ఆ రైతులకు ఎలాంటి ఉపాధి, ఆదాయ వనరులు ఉండవు. అందుకే చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన' (పీఎంకేఎంవై) పథకాన్ని అమలు చేస్తోంది. 60 ఏళ్లు పైబడిన రైతులకు నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ అందిస్తోంది.
పీఎంకేఎంవై పథకానికి ఎవరు అర్హులు?
18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతులందరూ ఈ పథకానికి అర్హులే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో పేరు నమోదై ఉండి, కేవలం 2 హెక్టార్ల వరకు సాగు చేయదగిన భూమిని కలిగి ఉండాలి. ఈ పరిధిలోకి వచ్చే చిన్న, సన్నకారు రైతులందరూ ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు. పింఛన్ మాత్రం వారికి 60 ఏళ్లు నిండిన తరువాత అందుతుంది.
ఈ పథకానికి అనర్హులు ఎవరు?
ప్రభుత్వ ఉద్యోగులు, జాతీయ పెన్షన్ పథకాన్ని ఎంచుకున్న రైతులు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్), ఈఎస్ఐ స్కీమ్, ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. అలాగే ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వర్గాల వారు, ఇతర చట్టబద్ధమైన సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు కూడా 'పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన' పథకంలో చేరడానికి వీలుపడదు.
ఎంత ప్రీమియం చెల్లించాలి?
రైతులు తమకు 60 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తరువాత రైతుకు ప్రతి నెలా రూ.3,000 పింఛన్ వస్తుంది. పథకంలో చేరిన రైతు వయసును అనుసరించి... ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతు చెల్లించిన ప్రీమియం ఎంత ఉంటుందో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి చెల్లిస్తుంది.
ఉదాహరణకు 18 సంవత్సరాల వయసున్న ఒక రైతు నెలకు రూ.55 చెల్లించాడని అనుకుందాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రైతు పేరు మీద రూ.55 బీమా కంపెనీకి చెల్లిస్తుంది. అంటే ఆ రైతు పేరుమీద కడుతున్న ప్రీమియం రూ.110 అవుతుంది. 40 ఏళ్లు పైబడిన వారికి నెలవారీ ప్రీమియం రూ.200 ఉంటుంది.
రైతు మరణిస్తే..
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనలో చేరిన రైతు మరణిస్తే.. అతని జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అప్పుడు ఆమెకు కూడా 60 ఏళ్లు దాటిన తరువాత నెలకు రూ.3,000 చొప్పున పింఛన్ ఇస్తారు. ముఖ్యమైన విషయం ఏటంటే.. పీఎంకేఎంవై పథకం పూర్తిగా స్వచ్ఛందం. అయితే ఈ పథకాన్ని కొనసాగించాలంటే కనీసం ఐదేళ్లపాటు రైతు తనవాటా ప్రీమియంను నిర్దేశిత తేదీ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి?
వ్యవసాయదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. రైతు ఫొటో, ఆదాయం, నివాసం, వయసు నిర్ధరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు.. సాగు భూమికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పీఎంకేఎంవై పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేసిన తరువాత రైతుకు సమాచారం అందుతుంది. తరువాత రైతు పేరున ప్రత్యేక పింఛన్ ఖాతాను తెరచి కార్డును అందిస్తారు.