Personal Loan Tips: ఆర్థిక అవసరాలు, అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడేందుకు వ్యక్తిగత రుణం ఎంతో ఉపయోగపడుతుంది. వ్యక్తిగత రుణం తీసుకొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే రుణాలు పొందాలంటే మంచి క్రెడిట్ స్కోరు అవసరం. డిజిటల్ బ్యాంకింగ్ మీద అవగాహన ఉన్నట్లయితే.. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండానే క్షణాల్లో అకౌంట్లో డబ్బు జమవుతుంది. మిగిలిన రుణాల మాదిరిగా తనఖా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే మిగతా అన్ని రుణాల్లాగానే.. నిర్దేశిత గడువులోగా ఈ వ్యక్తిగత రుణాన్నీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వివిధ కారణంతో ఈ రుణాలు తిరిగి చెల్లించనట్లయితే ఏం జరుగుతుంది? ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది?
క్రెడిట్ స్కోర్‌పై ఎఫెక్ట్..
వ్యక్తి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు క్రెడిట్ స్కోర్ ఉపయోగపడుతుంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఎంత మొత్తంలో రుణం ఇవ్వాలనే విషయాన్ని క్రెడిట్‌స్కోర్ ఆధారంగానే నిర్ణయిస్తాయి. క్రెడిట్‌స్కోర్‌ను లెక్కించడంలో రుణ చరిత్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల రుణం కట్టలేకపోయినట్లయితే అది మీ క్రెడిట్ స్కోర్ చరిత్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు మరొక రుణం తీసుకోవడం కష్టంగా మారుతుంది.
పెనాల్టీల భారం..
గడువులోగా రుణం తీర్చనట్లయితే క్రెడిట్‌స్కోర్‌పై ప్రభావం పడడమే కాకుండా పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అదే గనక జరిగితే మనం తీసుకున్న రుణం మరింత భారమవుతుంది. కాబట్టి సకాలంలో రుణాన్ని చెల్లించేందుకు ప్రయత్నించాలి.
వడ్డీ రేట్లు ప్రియం..
తీసుకున్న రుణాన్ని సరైన సమయంలో చెల్లించకపోతే.. అది మరింత ప్రియం అవుతుంది. రుణం ఇచ్చిన వారు కోల్పోయిన డబ్బును భర్తీ చేసేందుకు వడ్డీరేట్లను పెంటే అవకాశం ఉంది. దీనివల్ల మనం కట్టాల్సిన మొత్తం సొమ్ము మరింత పెరుగుతుంది. అయితే, రుణ బాధ్యతను నెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకున్నట్లయితే వడ్డీ రేటు పెంపును నివారించవచ్చు. అలాగే, ఒకసారి డిఫాల్ట్ అని క్రెడిట్ స్కోరులో ముద్ర పడితే.. భవిష్యత్ రుణాలు కూడా తక్కువ వడ్డీకి దొరకడం కష్టంగా మారవచ్చు.
చట్టపరమైన చర్యలు..
రుణం తీసుకున్నవారి నుంచి డబ్బును రాబట్టుకొనేందుకు రుణదాతలు చివరి ప్రయత్నంగా.. చట్టరీత్యా చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. ఇచ్చిన రుణంలో ఏ కొంచెం తిరిగి చెల్లించకున్నా చట్టరీత్యా చర్యలు చేపడతారన్న విషయాన్ని రుణగ్రస్థులు గుర్తుంచుకోవాలి.
ఆ పరిస్థితి రాకూడదంటే?..
రుణం కట్టలేని పరిస్థితులు ఎదురుకాకూడదంటే.. రుణం తీసుకునే ముందే ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. తీసుకుంటున్న రుణం మనం తిరిగి చెల్లించగలమా? లేదా? అనేది గ్రహించుకోవాలి. రుణ అర్హతకు ఉన్న నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఓ పట్టికను సిద్ధం చేసుకోవడం మంచిది. తిరిగి చెల్లింపుల చేయగలిగే సామర్థ్యం ఉందో లేదో గమనించుకోవాలి. ఒక్కోసారి ఖాతాలో డబ్బున్నా సరైన టైంలో చెల్లించడం మరచిపోతుంటాం. అలా జరగకుండా ఉండేందుకు ఆటోమేటిక్ పేమెంట్స్ ఆప్షన్‌ను ఉపయోగించడం మంచిది.