ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరుగుతున్న క్రమంలో దేశంలో కార్ల కొనుగోళ్లు కూడా రికార్డు స్థాయుల్లో నమోదవుతున్నాయి. అయితే కారును తమ వ్యక్తిగత పనుల కోసం నిత్యం నడిపే వారు కొందరైతే.. ఎప్పుడో ఒకసారి టూర్ల కోసం రోడ్డుపై నడిపేవాళ్లు మరికొందరు. ఈ నేపథ్యంలో కారును వాడినా వాడకపోయినా మోటార్ వాహన బీమాను మాత్రం ప్రతి యజమాని తీసుకోవాలి. ఇదిలా ఉంటే.. కారు నడపకపోయినా అనవసరంగా బీమా పాలసీకి డబ్బులు కడుతున్నామని ఫీలయ్యేవారు లేకపోలేరు. అలాంటి వారి కోసమే సరికొత్త బీమా పాలసీల పేరుతో మార్కెట్లోకి ప్రవేశించాయి పలు ఇన్సూరెన్స్ సంస్థలు. వీటి ప్రత్యేకత ఏంటంటే మన కారు వాడకాన్ని బట్టి ప్రీమియం కట్టేందుకు వీలుంటుంది.
వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 'పే యాజ్ యూ డ్రైవ్' (PAYD) మోటార్ బీమా పాలసీ వ్యవస్థ గురించి. మీ వాహన వినియోగాన్ని బట్టి బీమా ప్రీమియం చెల్లించడం ఈ రకమైన పాలసీలకున్న ప్రత్యేకత. PAYD పాలసీల్లో మీరు కారు నడిపే తీరు, మీరు తిరిగిన దూరం ఆధారంగా మనం వాడిన వాహనానికి ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.
వాహనానికి ఏదైనా నష్టం జరిగితే ఓన్ డామేజీ కింద పరిహారం ఇవ్వడం.. థర్డ్ పార్టీకి నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించడం వంటివి సాధారణ సాధారణంగా వాహన బీమా పాలసీలో కనిపిస్తాయి. థర్డ్ పార్టీ బీమా లేకుండా మాత్రం వాహనాన్ని రోడ్డుపై నడపకూడదు. అయితే, PAYD పాలసీ తీసుకునేటప్పుడు కూడా థర్డ్ పార్టీ బీమా ప్రీమియం చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ, మీరు తిరిగే దూరం ఆధారంగా, నడిపే విధానాన్ని బట్టి ఓన్ డ్యామేజీ కింద ప్రీమియంలో కొంతమేర రాయితీ పొందొచ్చు.
ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అందిస్తున్న బీమా ప్లాన్‌ను తీసుకుంటే ఏడాదిలో 10వేల కిలోమీటర్లలోపు మాత్రమే ప్రయాణిస్తే.. ఓన్ డ్యామేజీ ప్రీమియంలో 25 శాతం వరకు రాయితీ పొందొచ్చు. ఓడోమీటర్ రీడింగ్ ఆధారంగా ఈ కిలోమీటర్ల లెక్కింపు ఉంటుంది. ఈ తరహా పాలసీలను మిగతా బీమా సంస్థలు సైతం విక్రయిస్తున్నాయి.
PAYD పాలసీ ప్రీమియంను ఇలా లెక్కిస్తారు!
పే యాజ్ యూ డ్రైవ్ పాలసీలు అనేవి యాడ్ ఆన్ రూపంలో లభిస్తాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వాహన ప్రయాణ దూరం ఆధారంగా ప్రీమియం చెల్లింపులు ఉంటాయి. ఈ దూరాన్ని ఓడో మీటర్ రీడింగ్ ఆధారంగా లెక్కిస్తారు. ఇక రెండోది డ్రైవర్ ప్రవర్తనను బట్టి బీమా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అంటే వాహన వేగం, యాక్సిలరేషన్, బ్రేకింగ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మనం కట్టే ప్రీమియంను అంచనా వేస్తారు. ఇందుకోసం టెలీమెటిక్స్ అనే పరికరాలను వినియోగిస్తారు. ఈ పద్ధతులు మాత్రమే కాకుండా పై రెండూ కలగలిపిన హైబ్రిడ్ పాలసీలు సైతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
పాలసీ తీసుకునేముందు ఇవి పాటించండి!
PAYD పాలసీలను తీసుకునే ముందు పాత రకం బీమా పాలసీలతో పాటు ఇతర సంస్థలూ అందించే బీమా పాలసీలను బేరీజు వేసుకొండి. ప్రీమియం రేట్లు, కవరేజీ పరిమితులు వంటి అంశాలను సరిపోల్చండి. నడిపే విధానం ఆధారిత PAYD పాలసీలు తీసుకునే ముందు మనం వినియోగించే వాహనానికి టెలీమెటిక్స్ డివైజులను అమర్చాల్సి ఉంటుంది. డ్రైవింగ్ ప్రవర్తనను అంచనావేయడమే కాకుండా లొకేషన్ వంటి వ్యక్తిగత సమాచారం సైతం ఈ రకమైన పాలసీల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పాలసీ కొనేముందు పర్సనల్ డేటాను ఎలా వినియోగిస్తారనేది ఓ అంచనాకు రావడం ఉత్తమం. అలాగే PAYD పాలసీల్లో లిమిటెడ్ కవరేజీ మాత్రమే అందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలసీని తీసుకొనేముందు పాలసీ నియమ నిబంధనలను ఒకటికిరెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించాకే పాలసీలను తీసుకొండి.