Own house or rented house which is better in India : కొన్నేళ్ల క్రితం వరకు పెద్ద నగరాల్లో సామాన్యుడికి సొంత ఇల్లు అనేది కలగానే ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగింది. గృహ రుణాలు సైతం సులువుగా దొరుకుతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన కొన్నాళ్లకే ఓ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. ఇలా స్నేహితులో బంధువులో ఇల్లు కొనుగోలు చేశారనో చాలా మంది సొంతింటిివైపు అడుగులు వేస్తున్నారు. మరికొంతమంది ఇన్నేసి లక్షలు పెట్టి ఇంటిని కొనడం అవసరమా? అని ఆలోచిస్తున్నారు. మరి సొంతిళ్లు కొనాలా? అద్దెంట్లోనే ఉండాలా?
20 ఏళ్ల తర్వాత ఏది ఎంత?
Own house or rent : హైదరాబాద్ లాంటి నగరంలో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.60 లక్షలు వెచ్చించాలి. రూ.10 లక్షల వరకు పొదుపు చేసి, రూ.50 లక్షల వరకు బ్యాంకు రుణానికి వెళ్తున్నారనుకుందాం. 8 శాతం వడ్డీ చొప్పున మీరు చెల్లించే నెలసరి ఈఎంఐ సుమారుగా రూ.41,800. అంటే, 20 ఏళ్లకి సుమారుగా కోటి రూపాయలు. మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువ 20 ఏళ్లకి 10 శాతం వార్షిక వృద్ధి చొప్పున సుమారుగా రూ.4.03 కోట్ల వరకు ఉండొచ్చు. మీరు చెల్లించిన ఈఎంఐ ఖర్చులు మినహాయిస్తే, మీ ఆస్తి విలువ సుమారుగా రూ.3 కోట్లు అనుకోవచ్చు.
ఇప్పుడు అద్దెకి ఉన్నట్టయితే ఎంత వరకు సమకూర్చుకోవచ్చో చూద్దాం.. పైన తెలిపిన ఉదాహరణలో ఇంటిని కొనకుండా అద్దెకి తీసుకోవాలంటే సుమారుగా రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈఎంఐకి చెల్లించే రూ.41,800లో అద్దె పోను మిగిలిన రూ.26,800 మ్యూచువల్ ఫండ్‌లో సిప్ (SIP) చేసినట్టయితే 20 ఏళ్లకి 12 శాతం రాబడి అంచనా ప్రకారం సుమారుగా రూ.2.70 కోట్ల వరకు సమకూర్చుకోవచ్చు. మీరు బ్యాంకుకి చెల్లించే డౌన్ పేమెంట్ రూ.10 లక్షలు కూడా మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేసినట్టయితే ఇదే రాబడి అంచనా ప్రకారం సుమారుగా రూ.96 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. అంటే అద్దెకి ఉన్నట్టయితే 20 ఏళ్ల తర్వాత మీరు రూ.3.66 కోట్ల వరకు సమకూర్చవచ్చు.
గమనిక: అద్దెతో పాటు ఆదాయం కూడా పెరుగుతున్నందున, పైన తెలిపిన లెక్కల్లో వార్షిక అద్దె పెరుగుదలను పరిగణించలేదు. అలాగే, బ్యాంకు రుణంతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీ లాంటివి పరిగణనలోకి తీసుకోలేదు. అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విషయంలో తరుగుదల కూడా ఉండే అవకాశం ఉంటుంది. పైన తెలిపిన ఉదాహరణ ప్రకారం.. అద్దెకి ఉండడం కాస్త లాభదాయకంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఒక్క విషయమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అద్దెకి ఉండాలా లేక ఇంటిని కొనుగోలు చేయాలా అనే నిర్ణయాన్ని తీసుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అద్దె ఇంటి వల్ల ఇబ్బందులు:
rent house problems : మీరు అద్దె ఇంటిలో నివసించేటప్పుడు తగిన స్వేచ్ఛ లేకపోతే మీకు బాధ కలుగుతుంది. ఇంటిని లీజుకి తీసుకుంటే లీజు గడువు ముగిసిపోవచ్చు. లేక మీ ఇంటి యజమాని ఆస్తిని విక్రయించి మిమ్మల్ని ఖాళీ చేయమని అడగొచ్చు. ఇంటి అద్దె కూడా ఏటా పెరుగుతూనే ఉంటుంది. మీ ఆదాయం దానికి తగ్గట్టుగా పెరగకపోతే, చౌకైన ఇంటి కోసం పట్టణ శివారు ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
సొంత ఇంటిని కొనుగోలు చేస్తే: సొంతంగా ఇంటిని కొనుగోలు చేస్తే.. మీకు శాశ్వత నివాస స్థిరత్వం వస్తుంది. మీరు ఒక ప్రదేశంలో పాతుకుపోవచ్చు. అయితే మీరు గృహ రుణానికి చెల్లించే ఈఎంఐలు.. ఇంటి అద్దె కంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంటిని కొనుగోలు చేయడానికి, మీరు ఈఎంఐలను సకాలంలో చెల్లించడానికి ఆర్థికంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మీ సొంత ఇంట్లో నివసించడం వల్ల మీకు మీ కుటుంబానికి స్వేచ్ఛ, భద్రత ఉంటుంది. ఇది మీ ఆస్తి.. మీకు నచ్చిన విధంగా అనుభవించవచ్చు.
ఒకేచోట ఉంటారా?: మీరు ఒక నిర్దిష్ట ప్రదేశంలో చాలా కాలం పాటు.. అంటే 15-20 సంవత్సరాలు పైగానే నివసించబోతున్నట్లయితే సొంత ఇల్లు కలిగి ఉండటం మంచిదే. మీ వృత్తి మూలంగా తరచూ మారేవారైతే అద్దె ఇల్లే మంచిది. అద్దెకు తీసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో వసతిని కలిగి ఉంటారు. స్వల్ప కాలానికి ఆస్తిని కొనుగోలు చేయడం వల్ల ఇల్లు మారినప్పుడు దాన్ని అద్దెకివ్వడం, లేకపోతే విక్రయించడం వంటివి మీకు ఆర్థికంగా లాభించకపోవచ్చు. రియల్ ఎస్టేట్ మారకం వేగంగా జరిగే పనికాదు. దీనికి చాలా ఓపిక ఉండాలి.
ఆర్థిక సమస్యలు ఉండకూడదు: మీరు ఇంటిని రుణం ద్వారా కొనుగోలు చేసినా ఈఎంఐలను చెల్లించడానికి క్రమమైన ఆదాయం, స్థిరమైన ఉపాధిని కలిగి ఉండాలి. తక్కువ వడ్డీకే రుణం పొందడానికి 750 లేక ఇంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ని కలిగి ఉండేలా చూసుకోవాలి. ఇంటి రుణ ఈఎంఐలు అధిక మొత్తంలో ఉంటాయి. ఆర్థిక సమస్యలు కొన్ని నెలల పాటు కొనసాగినప్పుడు మీరు ఈఎంఐలు చెల్లించలేకపోవచ్చు. బ్యాంకు నోటీసులతో మానసిక ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టడానికి అత్యవసర నిధి అవసరం. మీ రుణ ఈఎంఐలను 6-12 నెలల పాటు అందించేంత నిధిని కలిగి ఉండాలి. మీరు ఉపాధిని తాత్కాలికంగా కోల్పోయినా ఈఎంఐల చెల్లింపులకు ఇబ్బంది ఉండదు.
తప్పనిసరి ఖర్చులు అధికంగా ఉంటే: ఇల్లు కొనడం ముఖ్యమైనదే గానీ, ఈ లోపులో ఎదుగుతున్న పిల్లల చదువు ఖర్చులు అడ్డంకిగా ఉండకూడదు. ఈ మధ్యకాలంలో పిల్లల చదువుల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పిల్లల చదువులకు కూడా బ్యాంకు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు ఇంటి రుణం, మరోవైపు విద్యా రుణాలకు ఏకకాలంలో ఈఎంఐలు చెల్లించలేరు. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవ్వడం కన్నా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సొంత ఇల్లు కన్నా పిల్లల చదువుకే నిధులను ఖర్చు పెట్టడం మంచిది.
చివరిగా:
own house vs rent house : ఇల్లు కొనడానికి, కొనకపోవడానికి చాలా కారణాలుంటాయి. వ్యక్తుల సాంఘిక, ఆర్థిక, భౌతిక పరిస్థితుల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. ఎవరో ఇల్లు కొనుక్కోవడం చూసి మీరు ఇంటి కొనుగోలుకు వెళ్లడం మంచిదికాదు. పూర్తిగా మీ ఆర్థిక పరిస్థితులు బలంగా ఉన్నప్పుడే సొంత ఇంటి గురించి ఆలోచించాలి.