OTT market share in India : గతంలో సెలవు అంటే థియేటర్లకు వెళ్లడం లేదా వీసీఆర్‌లో ఇంటిల్లిపాదికీ ఇష్టమైన సినిమా చూసేవాళ్లు. మల్టీప్లెక్స్‌లు వచ్చాక ఈ రెండింటికి ఆదరణ కరవైంది. కొత్త సినిమాలు కూడా సాధ్యమైనంత త్వరగా విడుదలవుతున్న ఓటీటీ (ఓవర్ ది టాప్)లు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తిష్ట వేస్తోంది. టీవీలోనే కాదు మొబైల్‌లోనూ కావాల్సిన పాత, కొత్త చిత్రాలను కోరుకున్నప్పుడు చూసుకునే వీలుండటం.. మల్టీప్లెక్స్‌లకు ఎసరు తెస్తోంది. 2018లో రూ.2590 కోట్ల స్థాయిలో ఉన్న ఓటీటీ పరిశ్రమ 2023 కల్లా రూ.11,944 కోట్ల స్థాయికి చేరుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..
ఓటీటీ మార్కెట్ 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తోంది. 1980ల్లో వీసీఆర్ పరిశ్రమ కూడా ఇలాగే రాణించింది. 2000 సంవత్సరం తరవాత నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు భారీగా రావడంతో వీసీఆర్‌లకు ఆదరణ తగ్గింది. ఇప్పటికే వినోద పరిశ్రమలో 7-9 శాతం వాటా, ఆదాయాన్ని ఓటీటీ రంగం సంపాదిస్తోంది. 40కి పైగా ఓటీటీ సంస్థలు అన్ని భాషల్లోనూ మంచి కంటెంట్‌ను పంచుతూ స్థిరంగా వృద్ధి బాట పడుతున్నాయి.
ఇంటర్నెట్ వేగం వల్లే
OTT subscribers in India : ప్రస్తుతం 45 కోట్ల మంది ఓటీటీ వినియోగదార్లు దేశంలో ఉన్నారు. 2023 చివరికల్లా వీరి సంఖ్య 50 కోట్లకు చేరొచ్చు. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ అందుబాటు ధరలో లభ్యం కావడం; ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య రెట్టింపు కావడం; డిజిటల్ చెల్లింపులను అందిపుచ్చుకోవడం; డిస్నీ హాట్‌స్టార్ వంటి అంతర్జాతీయ సంస్థలు తగ్గింపు ధరలను ప్రకటించడం.. ఇలా అన్ని కారణాలూ కలిసి ఓటీటీ వినియోగదార్లను అమాంతం పెంచేశాయి.
ఈ సంస్థలన్నీ అమెరికాతో పోలిస్తే 70-90 శాతం మేర చౌక పథకాలను ఇక్కడ అందిస్తున్నాయని నివేదిక తెలిపింది. సోనీలివ్ వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హాయ్‌చాయ్ వంటి ప్రాంతీయ కంపెనీలు సైతం ఓటీటీని ఆక్రమిస్తున్నాయి.
థియేటర్ లాభాల్ని తినేస్తున్నాయ్
OTT impact on Cinema : నెలకు 5 గంటలకు పైగా ఓటీటీలను 50 శాతం మందికి పైగా వినియోగిస్తుండడంతో సినిమా థియేటర్ లాభాలను ఓటీటీలు తినేస్తున్నాయి. ప్రధాన స్టూడియోలు, నిర్మాణ సంస్థలు కూడా ఈ స్ట్రీమింగ్ సిరీస్‌లకున్న గిరాకీని గమనించాయి. సంప్రదాయ సినిమా తయారీ కంటే వీటిల్లోనే ఎక్కువ లాభాలు లభిస్తున్నాయని గ్రహించి, ప్రత్యేకంగా వీటికోసం కంటెంట్ సృష్టిస్తున్నాయి. సొంతంగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాలను సైతం సిద్ధం చేసుకున్నాయి. అందుకు ఉదాహరణే తెలుగు ఓటీటీ ఆహా.
సినిమాకు ప్రమాదమే: జేమ్స్ కేమరూన్
ప్రపంచయుద్ధాల సమయంలోనూ మూతపడని థియేటర్లు కరోనా సమయంలో మూగబోయాయి. ఇలా థియేటర్లను నిలిపివేయడం వల్ల ప్రమాదమేనని అప్పట్లోనే హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కేమరూన్, మార్టిన్ స్కార్సీస్ పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రభుత్వాలు సహాయం చేయాలని అన్నారు. అయితే పూర్తయిన సినిమాలను నేరుగా వినియోగదారులకు చేర్చేందుకు వీలున్న ఓటీటీ సాంకేతికతకు నిర్మాతలు మొగ్గుచూపారు. కరోనా వేళ 30 హిందీ సినిమాలు ఓటీటీల్లోనే విడుదలయ్యాయి.
మరింత బలంగా..
రాబోయే కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారాలు విద్య, ఆరోగ్యం, ఫిట్‌నెస్ వైపు విస్తరించి భవిష్యత్‌ను బలోపేతం చేసుకోబోతున్నాయని అంచనా. కంటెంట్ సృష్టికర్తలకు ఇది కొత్తదార్లను తెరచింది. వీక్షకులు కూడా కేవలం వినోదమే కాకుండా.. అన్నింటినీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరించింది.