NPS New Rule For Pension Fund Withdrawal : వేతన జీవులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా అందించడం కోసం.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే.. జాతీయ పింఛను పథకం(NPS). సాధారణ పౌరులకు కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇది ట్యాక్స్ ఆదా చేసుకునేందుకు మంచి రిటైర్మెంట్ ఫండ్. అలాగే ఎన్పీఎస్ దీర్ఘకాలంలో మంచి రాబడిని అందించే పెట్టుబడి సాధనం. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండడంతో ఎక్కువమంది దీనిలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంటారు. అయితే.. NPS ఖాతాదారుల కోసం.. పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఖాతాదారులు కొంత మేర డబ్బు ముందస్తుగా తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం.. ఎన్పీఎస్ పింఛన్‌దారులు తమ కార్పస్ ఫండ్ నుంచి 25 శాతం మేర డబ్బును పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ఆర్డీఏ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. అయితే.. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ కండీషన్స్ ప్రకారం మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అవేంటంటే..
- పిల్లల ఉన్నత చదువుల కోసం ఎన్పీఎస్ ఖాతాదారులు పెన్షన్ ఫండ్ నుంచి 25 శాతం నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.(చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకూ ఈ రూల్ వర్తిస్తుంది)
- పిల్లల వివాహ ఖర్చుల కోసమూ డబ్బు తీసుకోవచ్చు.(చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకూ ఈ రూల్ అమలవుతుంది)
- సబ్‌స్క్రైబర్ తన పేరుతో లేదా జీవిత భాగస్వామి పేరుపై నివాస గృహం లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి, ఇంటి నిర్మాణం కోసం నగదు విత్‌డ్రా చేయొచ్చు. అయితే.. ఖాతాదారుడి పేరుపై ఇప్పటికే ఇల్లు ఉంటే.. డబ్బు తీసుకోవడానికి అవకాశం లేదు.
- క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, మేజర్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, ఇతర వ్యాధులకు వైద్య ఖర్చుల నిమిత్తం నగదు తీసుకోవచ్చు.
- చందాదారుడు వైకల్యంతో తలెత్తే వైద్యం, ఇతర ఖర్చుల కోసం జాతీయ పింఛన్ పథకం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ఏదైనా కొత్త స్టార్టప్ ఏర్పాటు చేసినప్పుడు దాని ఖర్చుల కోసం కూడా ఎన్పీఎస్ నుంచి మనీ పొందవచ్చు.
- నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టే పనుల కోసం అయ్యే ఖర్చులకు సైతం డబ్బు తీసుకునే అవకాశం ఉంది.
NPSలో చేరితే దిల్ఖుష్ రిటైర్మెంట్.. ట్యాక్స్ బెనిఫిట్స్.. సూపర్ రిటర్న్స్!
కొత్త నిబంధనల ప్రకారం డబ్బు ఎలా ఉపసంహరించుకోవాలంటే..
- ఫిబ్రవరి 1 తర్వాత NPS ఖాతా నుంచి డబ్బులు పాక్షిక ఉపసంహరణ చేసుకోవడానికి.. ఎన్పీఎస్ చందాదారులు తమ సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయం లేదా పాయింట్ ద్వారా.. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA)కి పైన పేర్కొన్న కారణాలతో సెల్ఫ్-డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి.
- ఖాతాదారుడు అనారోగ్యానికి గురైతే.. కుటుంబ సభ్యులు వారి తరపున డిక్లరేషన్‌ను సమర్పించాలి.
- ఆ తర్వాత CRA చందాదారుల బ్యాంక్‌తో 'పెన్నీ డ్రాప్' పరీక్షను నిర్వహిస్తుంది. ఆ తర్వాతే మొత్తం డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంది.
నగదు విత్ డ్రాకు అర్హతలు..
- ఎవరైతే పెన్షన్ ఫండ్ నుంచి 25 శాతం డబ్బు తీసుకోవాలనుకుంటున్నారో.. వారు ఎన్‌పీఎస్‌లో సభ్యులై 3 సంవత్సరాలు కావాలి.
- గరిష్ఠంగా మూడు సార్లు మాత్రమే పాక్షిక విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
NPS New Rule : ఎన్పీఎస్ ఖాతాదారులకు అలర్ట్.. ఇకపై పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ తప్పనిసరి..