Radhika merchants arangetram: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల రెండో తనయుడు అనంత్ అంబానీకి కాబోయే శ్రీమతి రాధికా మర్చంట్.. భరతనాట్య ఆరంగేట్రం చేశారు. ముంబయిలోని కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన భరతనాట్య ప్రదర్శన కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. అతిథులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి కార్యక్రమానికి హాజరై రాధిక తొలి నాట్య ప్రదర్శనను తిలకించి ఆశీర్వదించారు. అంబానీ, మర్చెంట్ కుటుంబాలు అతిథులకు సాదర స్వాగతం పలికాయి.
రాధిక అరంగేట్ర భరత నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వేదికపైనున్న దేవతలు, గురువుతో పాటు కార్యక్రమాన్ని వీక్షించే వారందరి నుంచి ఆశీస్సులను కోరుతూ నాట్య ప్రదర్శన ప్రారంభమైంది. అనంతరం గణేశ వందనం కొనసాగింది. ఆ తర్వాత అచ్యుతం.. కేశవం అంటూ రాముడి కోసం శబరి ఎదురుచూపులు గోపికలతో కృష్ణుడి నృత్యాలు చిన్ని కృష్ణుడి అల్లరి యశోదమ్మ చిరుకోపాల ఘట్టాలతో సాగిన నాట్యాభినయం అలరించింది. ఆ తర్వాత మానవుడిలో అంతర్లీనంగా ఉండే భావోద్వేగాలైన కరుణ, భయం, వీర, రౌద్ర, బీభత్స, అద్భుత, శృంగార, హాస్య రసాలను నాట్యబద్దంగా రాధిక పలికించిన తీరు సభికులను కట్టిపడేసింది.
రాధిక చివరగా చేసిన థిల్లానా.. వేదిక మీద అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రదర్శన ముగిసిన అనంతరం ఆహుతుల కరతాళధ్వనులతో ఆ ప్రాంగణమంతా కొన్ని నిమిషాల పాటు మార్మోగిపోయింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ నృత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కళా ప్రపంచానికి మరో అద్భుత కళాకారిణి దొరికింరంటూ సభికులు కొనియాడారు. రాధికా 8 సంవత్సరాలకుపైగా భావనా ఠాకర్ వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నారు. ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి కూడా భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది. ఆమె అప్పుడప్పుడూ ప్రదర్శనలు కూడా ఇస్తుంటారు. అంబానీ కుటుంబంలో నీతా ఇప్పుడు రెండో కళాకారిణి కానున్నారు.
ఇదీ చదవండి: అదానీని వెనక్కినెట్టి.. ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీనే.. మరి ప్రపంచంలో?