Nissan Datsun news today: జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్.. భారత్‌లో డాట్సన్ బ్రాండ్‌కు మంగళం పాడేసింది. ఇకపై ఈ బ్రాండ్ కార్లను తయారు చేయబోమని ప్రకటించింది. రష్యా, ఇండోనేసియాలో ఇప్పటికే ఈ బ్రాండ్‌ను నిలిపివేసిన నిస్సాన్.. భారత్‌లోనూ దీన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నిస్సాన్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని తమ ప్లాంట్‌లో డాట్సన్ రెడీ-గో ఉత్పత్తిని నిలిపివేసినట్లు పేర్కొంది. స్టాక్ ఉన్నంత వరకు ఈ మోడల్ విక్రయాలు కొనసాగుతాయని పేర్కొంది. ఇప్పటికే డాట్సన్ గో, గో+ ఉత్పత్తిని ఆ కంపెనీ నిలుపుదల చేసింది.
బ్రాండ్‌ను మూసివేసినప్పటికీ విక్రయానంతర సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని కంపెనీ వినియోగదారులకు హామీ ఇచ్చింది. వారెంటీ, పార్ట్స్ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్ట్రాటజీలో భాగంగా డాట్సన్‌ను నిలిపివేస్తున్నట్లు నిస్సాన్ తెలిపింది. అటు వినియోగదారులకు, డీలర్లకు, వ్యాపార భాగస్వాములకు ప్రయోజనం అందించే కోర్ మోడళ్లు, సెగ్మెంట్లపై మాత్రమే దృష్టిసారించనున్నట్లు పేర్కొంది.
డాట్సన్‌ను చాలా ఏళ్ల కిందటే నిస్సాన్ నిలిపివేసింది. అయితే, ఎంట్రీ లెవెల్ మార్కెట్‌పై దృష్టి సారించేందుకు డాట్సన్‌ను 32 ఏళ్ల తర్వాత మళ్లీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 2013లో భారత్‌లో డాట్సన్ రీ ఎంట్రీ ఇచ్చింది. మూడు వేర్వేరు మోడళ్లను విడుదల చేసింది. అయితే, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి మోడళ్ల నుంచి విపరీతమైన పోటీ ఉండడం వల్ల నిలదొక్కులేకపోయింది. దీంతో రీలాంచ్ చేసిన 9 ఏళ్ల తర్వాత ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఇదీ చూడండి: మళ్లీ పెరగనున్న సిమెంట్ ధరలు.. కారణం అదేనా?
నెట్‌ఫ్లిక్స్ షాక్.. పాస్వర్డ్ షేర్ చేస్తే ఛార్జ్! వీడియోలలో యాడ్స్!!