Nirma Glenmark Agreement : ముంబయికి చెందిన ప్రముఖ మందుల తయారీ సంస్థ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ తమ అనుబంధ సంస్థ అయిన గ్లెన్‌మార్క్ లైఫ్సైన్సెస్లోని మొత్తం 75 శాతం వాటాను వాషింగ్ పౌడర్ సంస్థ నిర్మా లిమిటెడ్‌కు విక్రయించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తమ కంపెనీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఓ ప్రకటనలో తెలిపింది. దీని విలువ రూ.5,651.5 కోట్ల అని గ్లెన్‌మార్క్ వెల్లడించింది. కాగా, ఒక్కో షేర్‌ను రూ.615కు అమ్మేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు కంపెనీ గురువారం తెలిపింది.
పదిశాతం లోపు వాటానే..!
GLS Nirma Deal : ఈ విక్రయం ద్వారా గ్లెన్‌మార్క్.. జీఎల్ఎస్(గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్)లో కేవలం 7.84 శాతం వాటాను మాత్రమే కలిగి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ లావాదేవీ.. రెగ్యూలేటరీ సహా వాటాదారుల సమ్మతి ఉంటేనే పూర్తవనుంది. నిబంధనల ప్రకారం జీఎస్ఎల్ వాటాను కొనుగోలు చేస్తున్న నిర్మా లిమిటెడ్.. ఇప్పటికే గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో షేర్లను కలిగిన పబ్లిక్ షేర్‌హోల్డర్స్ అందరికీ ఐపీఓను ఆఫర్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రకటన గ్లెన్‌మార్క్ సంస్థ ప్రయాణంలో తదుపరి దశను సూచించడమే కాకుండా కంపెనీ వృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని.. అలాగే దీర్ఘకాలికాలంలో వాటాదారుల విలువను మరింత పెంచడంలో సహాయపడుతుందని GLS మేనేజింగ్ డైరెక్టర్, CEO యాసిర్ రావ్జీ తెలిపారు.
"మేము నిర్మా లిమిటెడ్‌తో కలిసి కొత్త యాజమాన్యంలో స్వతంత్ర ఏపీఐ కంపెనీగా కొనసాగుతాము. క్రియాశీల ఔషధాల పరిశ్రమలో మా స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, అలాగే మా వృద్ధి పథాన్ని కొనసాగించేందుకు దీనిని ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నాము."
- యాసిర్ రావ్జీ, జీఎల్ఎస్ ఎండీ, సీఈఓ
జీఎల్ఎస్ షేర్లపై ప్రభావం!
GLS దీర్ఘకాలిక చికిత్సా విధానాలకు సంబంధించి ఫార్మాస్యూటికల్ పదార్థాలను డెవలప్ చేయడమే కాకుండా వాటిని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 ప్రముఖ జెనరిక్ కంపెనీలలో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ 16న స్థానంలో కొనసాగుతోంది. కాగా, ఈ సంస్థ తయారు చేసే జెనరిక్ మందులు గ్లోబల్ మార్కెట్లో ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థలకు సరఫరా చేస్తుంది. కాగా, తాజా పరిణామాలతో స్టాక్ ఎక్స్ఛేంజీ బీఎస్ఈ సూచీ సెన్సెక్‌లో గ్లెన్‌మార్క్ షేర్లు 3.32 శాతం మేర తగ్గి రూ.828.05 వద్ద ముగిసింది.